Yashasvi: ఓవర్‌ హైప్‌ వద్దు.. యశస్వి జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్‌ వ్యాఖ్యలు

ఓవర్‌హైప్‌ క్రియేట్‌ చేసి యశస్వి జైస్వాల్‌ (Yashsavi Jaiswal)పై ఒత్తిడి పెంచవద్దని.. అభిమానులు, మీడియాకు భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) సూచించాడు. 

Published : 03 Feb 2024 23:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) అదరగొడుతున్నాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (209) సాధించాడు. కేవలం 277 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. అతిపిన్న వయస్సులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో ఈ బ్యాటర్‌పై అభిమానులు, కొంతమంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో యశస్వి.. బ్రాడ్‌మన్‌ను అధిగమించాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌హైప్‌ క్రియేట్‌ చేసి జైస్వాల్‌పై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు సూచించాడు. 

‘‘చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌ను అభినందించాలనుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వండి. మనదేశంలో అందరికీ ఓ అలవాటు ఉంది. ప్రధానంగా మీడియా ఆటగాళ్ల ఘనతలను ఎక్కువ హైప్‌ క్రియేట్‌ చేసి చూపించి ఏదో ఒక ట్యాగ్ అంటగట్టి హీరోలను చేస్తుంది. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో వారు తమ సహజశైలిలో ఆడలేరు. యశస్విని ఎదగనివ్వండి, క్రికెట్‌ను ఆస్వాదించనివ్వండి’’ అని గంభీర్‌ విజ్ఞప్తి చేశాడు. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్న శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు గంభీర్‌ మద్దతుగా నిలిచాడు. “వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు. కాబట్టి మనం వారికి సమయం ఇవ్వాలి. గతంలో తమ సత్తా ఏంటో చాటారు. అందుకే భారత్‌ తరఫున ఆడుతున్నారు’’ అని గౌతీ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని