MCA: రంజీ ట్రోఫీ విజేత ముంబయి.. ఆటగాళ్లకు డబుల్‌ బొనాంజా ప్రకటించిన ఎంసీఏ

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఛాంపియన్‌గా నిలవడంతో తమ జట్టు ఆటగాళ్లకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) భారీ నజరానాను ప్రకటించింది. 

Published : 14 Mar 2024 18:43 IST

ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన ముంబయి జట్టుకు (Mumbai Team) అసోసియేషన్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదర్భపై ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత విజయంతో ముంబయి 42వసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో తమ జట్టు సభ్యులకు రంజీ ట్రోఫీ ప్రైజ్‌మనీతోపాటు డబుల్‌ నజరానాను ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.  ప్రైజ్‌మనీ వచ్చేదానితోపాటు అదనంగా రూ.5 కోట్లను ముంబయి స్క్వాడ్‌ సొంతం చేసుకోనుంది. ‘‘ఎంసీఏ అధ్యక్షుడు అమోల్‌ ఖేర్, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన మా జట్టు సభ్యులకు ప్రైజ్‌మనీని డబుల్‌ ఇవ్వాలని భావించారు. ముంబయి జట్టుకు ఈ సీజన్‌ బాగా కలిసొచ్చింది. అన్ని టోర్నీల్లో కలిపి ఏడు టైటిళ్లు సాధించాం. బీసీసీఐ టోర్నీల్లోని అన్ని విభాగాల క్రికెట్‌లో మావాళ్లు రాణించారు’’ అని ఎంసీఏ కార్యదర్శి అజింక్య నాయక్‌ వెల్లడించారు. 

తక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌ను నేనే: రహానె

అజింక్య రహానె నాయకత్వంలోని ముంబయి ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు ఎనిమిది సీజన్ల తర్వాత ఛాంపియన్‌ కావడం విశేషం. టైటిల్‌ను అందుకొన్న తర్వాత రహానె మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో మా జట్టు తరఫున తక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌ను నేనే. ట్రోఫీని అందుకోవడంతో ఎక్కువగా సంతోషపడే ఆటగాడిని కూడా నేనే. క్రికెటర్‌గా ఎత్తు పల్లాలను చవిచూస్తుంటాం. అయితే, డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం కల్పించడం చాలా ముఖ్యం. గతేడాది మేం నాకౌట్‌ దశకు అర్హత సాధించడంలో విఫలమయ్యాం. కానీ, ఈసారి మాత్రం జట్టులోని ప్రతిఒక్కరూ ఫిట్‌నెస్‌ సాధించడంలో ఎంసీఏ కీలకపాత్ర పోషించింది. ఈసందర్భంగా మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. ఈసారి ఫైనల్‌లో విదర్భ చాలా బాగా పోరాడింది. కానీ మా బౌలర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు’’ అని రహానె వ్యాఖ్యానించాడు. 

ధవళ్ కులకర్ణి రిటైర్‌మెంట్..

సీనియర్ ఆటగాడు ధవళ్ కులకర్ణి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సీజన్‌ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటిస్తానని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ముంబయి కోసం ఆరు ఫైనల్స్‌లో ఆడిన ధవళ్ ఐదింట్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రహానెతో కలిసి అండర్‌ -14, అండర్‌ -19 విభాగాల్లో ధవళ్‌ కులకర్ణి ఆడాడు. ఇతను జాతీయ జట్టు తరఫున 2014లో అరంగేట్రం చేసినా ఎక్కువగా అవకాశాలు రాలేదు. 12 వన్డేలు, 2 టీ20లను మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 95 మ్యాచుల్లో 281 వికెట్లు తీశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని