Gautam Gambhir: ధోనీ జట్టులో ఉండటం అదృష్టం..!

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని మ్యాజీ బ్యాటర్ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడు జట్టు కోసం చాలా త్యాగాలు చేశాడని కొనియాడాడు. 

Updated : 18 Sep 2023 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీ (MS Dhoni) విషయం ప్రస్తావించిన ప్రతిసారి టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలు మార్లు గౌతమ్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. కానీ, తాజాగా ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు గంభీర్‌. అతడు జట్టులో ఉండటం అదృష్టమని పేర్కొన్నాడు. ఆయన ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘‘బ్యాటింగ్‌తోనే గేమ్‌ స్వరూపాన్ని మార్చేయగల తొలి భారత వికెట్‌ కీపర్‌. గతంలో కీపర్లు భిన్నంగా ఉండేవారు. వారు తొలుత కీపర్లు.. ఆ తర్వాతే బ్యాటర్లు. కానీ, ధోనీ దీనికి పూర్తిగా భిన్నం. అతడు తొలుత బ్యాటర్‌.. ఆ తర్వాతే వికెట్‌ కీపర్‌. ఎంఎస్‌ ధోనీ లభించడం టీమ్‌ ఇండియా అదృష్టం. జట్టుకు ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌లు గెలిపించగల కీపర్‌-బ్యాటర్‌ మాకు లభించాడు. అతడిలో ఆ స్థాయి పవర్‌ గేమ్‌ ఉంది. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే.. మరిన్ని పరుగులు సాధించేవాడు. చాలా వన్డే రికార్డులు బద్దలయ్యేవి’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

అశ్విన్ వన్డే వరల్డ్‌ కప్‌ ఆడతాడా..? రోహిత్ సమాధానంతో కొత్త చర్చ!

ధోనీ జట్టు నాయకుడిగా నిస్వార్థంగా పనిచేశాడని గౌతమ్‌ వ్యాఖ్యానించాడు. జట్టు ప్రయోజనాల తర్వాతే తన గురించి ఆలోచించేవాడని వెల్లడించాడు. ‘‘జనాలు ఎప్పుడూ కెప్టెన్‌గా ధోనీ సాధించిన విజయాల గురించే మాట్లాడతారు. కానీ, కెప్టెన్సీ కారణంగా అతడిలో ఉన్న బ్యాటర్‌ను త్యాగం చేశాడని నేను అనుకొంటున్నాను. అతడు తన బ్యాట్‌తో చాలా సాధించగలడు.. కానీ, సాధించలేదు. కెప్టెన్‌గా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. మీరు ముందు జట్టు గురించి ఆలోచిస్తారు.. ఈ క్రమంలో మీ గురించి ఆలోచించుకోరు. అతడు 6,7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అదే కెప్టెన్‌గా లేకపోతే అతడు జట్టులో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. జట్టు విజయాల కోసం ధోనీ అంతర్జాతీయ రన్స్‌ను త్యాగం చేశాడు’’ అని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. ధోనీ వన్డే కెరీర్‌లో 10 శతకాలతో 10,773 పరుగులు పూర్తి చేశాడు. వీటిల్లో 73 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని