Maldives - MS Dhoni: లక్షద్వీప్‌-మాల్దీవుల వివాదం.. వైరల్‌ అవుతోన్న ధోనీ వీడియో

లక్షద్వీప్‌ - మాల్దీవుల వివాదం కొనసాగుతున్న వేళ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) భారత పర్యాటకంపై మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.  

Updated : 11 Jan 2024 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్‌ పఠాన్‌, సురేశ్ రైనా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

‘‘నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తాను. కానీ, వెకేషన్స్‌ కోసం కాదు. కెరీర్‌ కొనసాగుతున్నప్పుడు మ్యాచ్‌లు ఆడటానికి ఆయా దేశాలకు వెళ్లాను. అక్కడ ఎక్కువగా ఎంజాయ్‌ చేయకుండా.. మ్యాచ్‌లు ముగియగానే భారత్‌కు తిరిగి వచ్చేవాడిని. నా భార్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు మాకు కొంత సమయం దొరకడంతో పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాం. భారత్‌ నుంచే ఈ టూర్ ప్రారంభించాలనుకుంటున్నాం. ఇక్కడ మనకు చాలా అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నేను ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాలకు వెళ్లే ముందు భారత్‌లో ఉన్న సుందరమైన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నా’’ అని ధోనీ ఆ వీడియోలో అన్నాడు.

షమి ఏమన్నాడంటే? 

టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్‌ షమి (Mohammed Shami) కూడా మాల్దీవులు, లక్షద్వీప్‌ వివాదంపై స్పందించాడు. ‘‘మనం మన పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. దేశం ముందుకు వెళ్తే.. అందరికీ మంచి జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం కూడా దానికి మద్దతు ఇవ్వాలి’’ అని షమి పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని