IPL 2024: అన్‌సోల్డ్‌ కావడం సంతోషమే.. అప్పుడు మా నాన్న ఒక మాట అన్నారు: ముషీర్‌ ఖాన్

ఐపీఎల్‌లో (IPL) ఆడితే కాసుల వర్షం. కానీ, ఓ తండ్రి మాత్రం తన కుమారులు జాతీయ జట్టు తరఫునే ఆడాలని కోరుకున్నాడు. అందులో ఒకరు ఆ లక్ష్యం సాధించగా.. మరొకరు రేసులో ఉన్నారు.

Published : 15 Mar 2024 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముషీర్‌ఖాన్ (Musheer Khan) సెంచరీతో అలరించాడు. ముంబయి 42వసారి విజేతగా నిలవడంలో 19 ఏళ్ల కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. అయితే, అతడిని ఈసారి ఐపీఎల్‌లో చూడటం కష్టమే. గత ఐపీఎల్‌ (IPL) మినీ వేలంలో ముషీర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు ఎవరూ అతడిని సంప్రదించలేదు. అయితే, తన అన్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం దిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈక్రమంలో ఐపీఎల్‌లో ఆడలేకపోవడంపై తానేమీ బాధపడటం లేదని ముషీర్‌ వ్యాఖ్యానించాడు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికైనా తప్పకుండా ఐపీఎల్‌లోకి అడుగుపెడతాననే నమ్మకం ఉందని తెలిపాడు.

‘‘ఐపీఎల్‌ జాబితాలో నా పేరు లేదు. దానికేమీ నేను నిరుత్సాహపడటం లేదు. మా నాన్న ఒక విషయం చెప్పారు. ‘భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలి. ఐపీఎల్‌ అవకాశం ఎప్పుడైనా వస్తుంది. ఇవాళ కాకపోతే మరుసటి ఏడాది. కానీ, జాతీయజట్టులోకి అడుగుపెట్టడం అత్యంత కీలకం’ అనే మాటలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు ఆడే అవకాశం రాకపోవడం కూడా మంచిదే. టీ20 క్రికెట్‌ను మరింత అర్థం చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. అప్పుడు, వచ్చే ఐపీఎల్‌లో నా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తా. ఈ ఫార్మాట్‌కు సన్నద్ధమవుతా. 

రంజీ ఫైనల్‌లో శతకం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా సోదరుడు సర్ఫరాజ్ ఖాన్‌ నుంచే స్ఫూర్తి పొందా. అతడి నిబద్ధత, ఆడే విధానం అద్భుతం. మా ఇద్దరి బ్యాటింగ్‌ స్టైల్‌ కాస్త ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్‌ ముందు ‘ఇది చాలా సాధారణ మ్యాచ్‌. అనవసరంగా ఒత్తిడికి గురి కావద్దు’ అని సర్ఫరాజ్‌ తెలిపాడు. బయట నుంచి చూస్తే నార్మల్‌ మ్యాచ్‌లానే ఉంటుంది. కానీ, మైదానంలోకి దిగాక మాత్రం వద్దనుకున్నా ఒత్తిడికి గురవుతుంటాం. బ్యాటింగ్‌లో ప్రాథమిక అంశాలను అనుసరించి పరుగులు చేయాలని సూచించాడు’’ అని ముషీర్ ఖాన్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని