Netherlands: వన్డే ప్రపంచ కప్‌కు నెదర్లాండ్స్‌ జట్టు... తెలుగు మూలాలున్న తేజకు చోటు

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానునున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. తెలుగు ములాలున్న తేజ నిడమనూరు (Teja Nidamanuru)కు జట్టులో చోటు దక్కింది. 

Updated : 07 Sep 2023 18:51 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. తాజాగా నెదర్లాండ్స్‌ (Netherlands) కూడా తమ జట్టు వివరాలను వెల్లడించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా 15మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. తెలుగు ములాలున్న తేజ నిడమనూరు (Teja Nidamanuru)కు నెదర్లాండ్స్‌ ప్రపంచకప్ జట్టులో చోటుదక్కింది. ఆల్‌రౌండర్‌ అయిన తేజ.. విజయవాడలో పుట్టి నెదర్లాండ్స్ జాతీయ జట్టుకు 2022 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. 

‘ఇషాన్ 2 ఇన్‌ 1 ప్లేయర్‌.. ఆ ఓవర్లలో ఎలా ఆడాలో సూర్యకుమార్‌కు తెలీదు’

ఇక, నెదర్లాండ్స్‌ జట్టు విషయానికొస్తే.. వాన్ డెర్ మెర్వే, అకెర్మాన్‌లకు తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో వీరిద్దరూ ఆడలేదు. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ సత్తాచాటింది. సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించి చివరి బెర్తును సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్‌ ప్రపంచకప్ ఆడటం ఇది ఐదోసారి. చివరిసారిగా భారత్‌ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడింది. ఈ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా (అక్టోబర్ 6న) జరగనుంది.  

నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్ జట్టు: 

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్‌, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.  

ప్రాక్టీస్‌కు దూరంగా కోహ్లీ, రోహిత్‌!

ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా (Team India) ప్రాక్టీస్‌ మొదలెట్టింది. కొలంబోలో మన ఆటగాళ్లు ఇండోర్ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఈ ఐచ్ఛిక (ఆప్షనల్) ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్‌ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా.. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ నెట్స్‌లో చాలా సమయం గడిపాడు. చివరి ఓవర్లలో శార్దూల్ ఠాకూర్‌ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేలా కోచ్‌ ద్రవిడ్ అతనికి కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని బంతులను సంధించాడు. సూర్యకుమార్ యాదవ్‌కు కూడా ద్రవిడ్ పలు సూచనలు చేశాడు. శుభ్‌మన్ గిల్ కుడిచేతివాటం బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ప్రధానంగా స్వింగ్ బంతులు ఆడటంపై దృష్టి సారించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని