Riyan Parag: నా ప్రదర్శనే.. భారత్‌ జట్టులోకి పిలుపు వచ్చేలా చేస్తుంది: రియాన్‌

టీమ్‌ఇండియాలో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్లుగా ఎదిగారు. భవిష్యత్తులో రియాన్‌ పరాగ్‌ కూడా టాప్‌ ఆల్‌రౌండర్‌గా మారే అవకాశం ఉన్న ఆటగాళ్లలో ముఖ్యుడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలోనూ బ్యాట్‌, బంతితో అదరగొట్టేస్తున్నాడు.

Published : 27 Nov 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జాతీయ క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించడం ప్రతి భారతీయ యువ క్రికెటర్‌ కల. దేశీయంగా ఎన్ని మ్యాచ్‌లు ఆడినా.. టీమ్‌ఇండియా జెర్సీతో మైదానంలోకి అడుగు పెడితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. భారత టీ20 లీగ్‌తోపాటు విజయ్‌ హజారే, రంజీ ట్రోఫీలో అదరగొడుతూ భారత జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. బౌలర్లు, బ్యాటర్ల కంటే ఆల్‌రౌండర్లకు ఇప్పుడు డిమాండ్‌ ఎక్కువ. ఇదే కోవలోకి 21 ఏళ్ల యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ వస్తాడు. భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉంది. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో అస్సాం జట్టుకు ఆడుతోన్న రియాన్‌ లక్ష్యం ఏంటంటే మాత్రం.. భారత జెర్సీని వేసుకోవడమేనని చెప్తాడు.

‘‘దేశీయ క్రికెట్‌లో రాణిస్తే తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు నా ప్రదర్శన కూడా చాలా బాగుంది. ప్రతి క్రికెటర్‌ లక్ష్యం కూడా జాతీయ జట్టులోకి రావాలనే ఉంటుంది. ముస్తాక్‌ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో బ్యాట్‌, బంతితో అత్యుత్తమ ప్రదర్శనే చేశా. మా జట్టు (అసోం) పాయింట్ల పట్టికలోనూ దూసుకుపోతోంది. ఫైనల్‌ వరకు వెళ్తే మా సభ్యుల్లో కొందరికి తప్పకుండా భారత్‌ A నుంచి పిలుపు రావడం ఖాయం. ఇప్పటి వరకు మా జట్టు అర్హత సాధించలేదు కాబట్టి మా పేర్లు రాలేదు. ఈసారి మాత్రం అలా ఉండబోదు’’ అని రియాన్‌ వెల్లడించాడు. అస్సాం తరఫున ఆడుతున్న రియాన్‌ ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీతో 363 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 8 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో జమ్ముకశ్మీర్‌తో అస్సాం నవంబర్ 28న తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని