Nitish Reddy: సీమర్లను వదిలి.. స్పిన్నర్లను బాది: హిట్టింగ్‌పై నితీశ్‌ రెడ్డి

పంజాబ్‌పై హైదరాబాద్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని వెనుక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డిదే కీలక పాత్ర.

Updated : 10 Apr 2024 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌పై హైదరాబాద్‌ విజయం సాధించడంలో ఓ తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ(64) తోపాటు బౌలింగ్‌లో ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. అతడి వల్లే 39/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్‌ చివరికి 182 పరుగులు చేయగలిగింది. తన కీలక ఇన్నింగ్స్‌పై నితీశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘వ్యక్తిగతంగా నా ఆట ఎంతో సంతృప్తినిచ్చింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఈసారి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగా. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పంజాబ్‌ సీమర్లు అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. అందుకే, దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదు. స్పిన్నర్లు వస్తారని.. వారిపై ఎటాక్ చేస్తే బాగుంటుందని ముందే అనుకున్నా. ఆ ప్రణాళిక ప్రకారమే ఆడాను. కగిసో రబాడ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రస్తుత టోర్నీలో సీమర్లు స్లో బౌన్సర్లతో ఇబ్బంది పెడుతున్నారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. నేను బౌలింగ్‌ చేసేటప్పుడు కూడా ఇలానే బంతులేశా. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా ఏదైనా సరే జట్టు కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా’’ అని నితీశ్‌ వెల్లడించాడు. 

టీ20 గేమ్‌ అంటే ఇదే..: భువనేశ్వర్‌ కుమార్

హైదరాబాద్‌ సీనియర్‌ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ చక్కటి బౌలింగ్‌ సంధించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో శిఖర్ ధావన్‌ స్టంపౌట్‌ కూడా ఉంది. మ్యాచ్‌ అనంతరం భువీ మాట్లాడుతూ.. ‘‘టీ20 గేమ్‌ ఇలానే ఉంటుంది. విజయం కోసం ఇరు జట్లూ తుది వరకూ పోరాడతాయి. ముల్లాన్‌పుర్ పిచ్‌ చివరి రెండు ఓవర్లలో చాలా మారిపోయింది. ఉత్కంఠపోరులో విజయం సాధించడం ఆనందంగా ఉంది. శిఖర్ ధావన్‌ను స్టంపౌట్‌ చేయడం అద్భుతం. వికెట్‌ కీపర్‌ క్లాసెన్‌ను ముందు ఉండమని కోరా. ఎందుకంటే శిఖర్ క్రీజ్‌ను వదిలి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో నేను పుణె వారియర్స్‌కు ఆడినప్పుడు కూడా ధావన్‌ ఇలానే స్టంపౌట్‌ అయ్యాడు. టోర్నీలో మున్ముందు విజయాలు సాధించాలంటే ఈ రకమైన వ్యూహాలను కొనసాగించాల్సి ఉంటుంది. నితీశ్‌ రెడ్డి చాలా బాగా ఆడాడు. చెన్నైపైనా అతడి బ్యాటింగ్‌ను చూస్తే ముచ్చటేసింది. ఆత్మవిశ్వాసంతో క్రీజ్‌లో పాతుకుపోతాడు. భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించగల సత్తా అతడికి ఉంది’’ అని తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు.. 

  • ఐపీఎల్‌లో పంజాబ్‌ అతి తక్కువ మార్జిన్‌తో ఓడిన మ్యాచుల్లో ఇది నాలుగోది. బెంగళూరు చేతిలో (2016) ఒక్క పరుగు, కోల్‌కతాపై (2020) 2 రన్స్‌, రాజస్థాన్‌ చేతిలో (2021) 2 పరుగుల తేడాతో ఓడింది.
  • ఐపీఎల్‌లో అతి తక్కువ మార్జిన్‌తో హైదరాబాద్‌ గెలిచిన తొలి మ్యాచ్‌ ఇదే. ఇప్పుడు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2022లో ముంబయిపై 3 పరుగులు, 2014లో దిల్లీపై 4 పరుగులు, 2016లో పుణె, బెంగళూరు జట్లపై నాలుగేసి పరుగుల తేడాతో గెలిచింది.
  • ఐపీఎల్‌లో పంజాబ్‌పై హైదరాబాద్‌ విజయాల శాతం 68.18. ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో తలపడగా 15 హైదరాబాద్ గెలిచింది. గతంలో కోల్‌కతాపై ముంబయి 71.88 శాతం, హైదరాబాద్‌పై చెన్నై 70 శాతం, డెక్కన్ ఛార్జర్స్‌పై పంజాబ్‌ 70 శాతం విజయాలను నమోదు చేశాయి. 
  • పంజాబ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన నితీశ్‌ రెడ్డికిదే తొలి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని