IND vs ENG: జేమ్స్‌ అండర్సన్‌ రిటైర్‌మెంట్‌పై పోస్టర్‌.. రవిశాస్త్రి షార్ప్‌ కామెంట్

క్రికెట్‌ మ్యాచ్‌ సమయంలో అభిమానులు సరదా పోస్టర్లు ప్రదర్శిస్తుంటారు. తాజాగా జేమ్స్‌ అండర్సన్‌ గురించి కూడా ఇలాంటి పోస్టర్‌ వైరల్‌గా మారింది. 

Published : 26 Feb 2024 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 41 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్ అండర్సన్‌ (James Anderson) ఇంకా టెస్టుల్లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా భారత్‌తో నాలుగో టెస్టులోనూ రెండు వికెట్లు తీశాడు. ఇది అతడికి 186వ టెస్టు మ్యాచ్‌. మరో రెండు వికెట్లు తీస్తే 700 క్లబ్‌లోకి చేరతాడు. ఈ క్రమంలో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ సందర్భంగా ఓ అభిమాని ‘స్పెషల్‌ పోస్టర్‌’ను ప్రదర్శించాడు. ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ను ఉద్దేశించి ‘‘జేమ్స్‌ అండర్సన్‌ ఎప్పుడైతే రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడో.. అప్పటి నుంచే నేను చదవడం ప్రారంభిస్తా’’ అని రాసిపెట్టాడు. టెస్టులకే పరిమితమైన అండర్సన్‌ ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికేలా లేడు. దీంతో భారత మాజీ ప్రధాన కోచ్‌, ప్రస్తుతం ఈ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది. 

‘‘అందుకోసం నువ్వు చాలా కాలం వేచి ఉండాలని యంగ్‌ మ్యాన్‌.  నువ్వు భారీ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవడం బెటర్. అండర్సన్‌ ఇప్పట్లో రిటైర్‌మెంట్ ప్రకటించేలా లేడు. అతడు సుదీర్ఘమైన కెరీర్‌ను మనం అభినందించాలి. ఇప్పటికీ అదే అత్యుత్తమ ఆటతీరుతో కొనసాగుతున్నాడు’’ అని కామెంట్రీ బాక్స్‌లో రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

జో రూట్‌ ఔట్‌పై పోస్టు డిలీట్‌ చేసిన మైకెల్ వాన్‌

మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాటర్ జోరూట్ ఔటైన తీరుపై ఆ జట్టు మాజీ సారథి మైకెల్‌ వాన్‌ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కాసేపటికే దానిని డిలీట్‌ చేసేశాడు. అయితే, అప్పటికే వైరల్‌గా మారిపోయింది. ‘‘సాంకేతికతను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. లెగ్‌సైడ్‌ వైపు బంతి సగానికిపైగా పడినట్లు అనిపించినా.. హాక్‌ఐ మాత్రం రెడ్‌ మార్క్‌ చూపించింది. చివరికి జో రూట్‌ పెవిలియన్‌కు చేరాడు’’ అని రాసుకొచ్చాడు. దానిని డిలీట్‌ చేసిన మైకెల్‌ వాన్‌ మరో పోస్టులో.. ‘‘రూట్‌ ఔటైనప్పుడు మరిన్నిసార్లు రిప్లేలను చూస్తే బాగుండేది. ఇన్నింగ్స్‌కు కీలకమైన సమయంలో ఇలా జరగడం సరైంది కాదు. సహచరుడి కోసం అడిగా’’ అని ట్వీట్ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు