Gautam Gambhir: ఒక్క ఓటమి కారణంగా రోహిత్‌ను బ్యాడ్‌ కెప్టెన్‌ అని ఎలా అంటారు?: గంభీర్‌

వన్డే ప్రపంచకప్‌ 2023లో రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ తీరుపై మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు.

Updated : 10 Dec 2023 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో వరుస విజయాలతో టీమ్‌ఇండియా (Team India)ను ఫైనల్‌కు చేర్చిన సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. రోహిత్‌ సేన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు. భారత్‌ ఖాతాలో ఒక్క బ్యాడ్‌ గేమ్‌ తప్పించి.. టోర్నీ మొత్తం ఆధిపత్యం చెలాయించిందని పేర్కొన్నాడు.

‘‘రోహిత్‌ది గొప్ప కెప్టెన్సీ. ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలవడం అంత సులువైన విషయం కాదు. ఈ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు అద్భుతం. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ముందు కూడా ఇదే విషయం చెప్పాను. ఫైనల్‌లో ఎలాంటి ఫలితం వచ్చినా.. భారత్‌ ఛాంపియన్‌లా ఆడింది. ఒక బ్యాడ్‌ గేమ్‌ రోహిత్‌ శర్మను, అతడి జట్టును చెడ్డగా మార్చదు. పది మ్యాచ్‌ల్లో ఎంతో గొప్పగా ఆడారు. ఒక్క ఓటమి కారణంగా రోహిత్‌ను బ్యాడ్‌ కెప్టెన్‌ అనడం సరికాదు’’ అని ఓ మీడియా పాడ్‌కాస్ట్‌లో గంభీర్‌ వివరించాడు.

కుర్రాళ్లకు పరీక్ష.. దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20 నేడు

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ టీమ్‌ఇండియాకు సారథ్యం వహించాలని గంభీర్‌ సూచించాడు. ‘‘రోహిత్‌ మంచి ఫామ్‌లో ఉంటే.. 2024 పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌ను నడిపించాలి. ఫామ్‌లో లేకపోతే ఎంపిక చేయవద్దు. వయసు ఆధారంగా ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించకూడదు. ఫామ్‌ ఆధారంగానే ఆ ప్రక్రియ కొనసాగాలి’’ అని గంభీర్‌ వివరించాడు. ఇక రిటైర్మెంట్‌ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని అతడు పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ ఫార్మాట్‌కు సూర్య కుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా చేస్తున్నాడు. ఆ తర్వాత సఫారీలతో వన్డే సిరీస్‌ను కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో.. టెస్టు సిరీస్‌ను రోహిత్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని