IND vs PAK: బ్యాటింగ్‌ లైనప్‌లో దాయాది దేశాలకు మధ్య తేడా అదే: సంజయ్‌ బంగర్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ పోరుకు ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది. ఈసారి ఎలాగైనా పాక్‌ను మట్టికరింపిచాలని టీమ్‌ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Published : 07 Oct 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ పోరుకు ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. అక్టోబర్‌ 17న ఆసీస్‌, అక్టోబర్ 19న కివీస్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచులను ఆడనుంది. ఇక అక్టోబర్ 23న పాక్‌ మ్యాచ్‌తో టీమ్‌ఇండియా కప్‌ వేటను ప్రారంభించనుంది. గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా పాక్‌ను మట్టికరిపించాలని టీమ్‌ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.  ఈ క్రమంలో ఇరు జట్ల బలాలపై భారత బ్యాటింగ్‌ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ విశ్లేషించాడు. టీమ్‌ఇండియాలో నలుగురైదుగురు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారని, అదే పాకిస్థాన్‌ అయితే ఓపెనర్లపైనే అధికంగా ఆధారపడుతోందని వ్యాఖ్యానించాడు. 

(పాత చిత్రం)

‘‘భారత్‌, పాకిస్థాన్‌ జట్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ను గమనిస్తే.. పాక్‌ ఎక్కువగా ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ మీదనే ఆధారపడుతోంది. కానీ టీమ్‌ఇండియాకు అలాంటి పరిస్థితి లేదు. ఒకరిద్దరిని నమ్ముకొని ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కనీసం నలుగురైదుగురు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా వారంతా మంచి ఫామ్‌లో ఉండటం విశేషం. అందుకే బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ కంటే భారత్‌ మంచి స్థాయిలో ఉంది’’

‘‘ఇక బౌలింగ్‌ను గమనిస్తే మాత్రం ఇందులో దాయాది దేశమే కాస్త పైచేయి సాధించేలా ఉంది. మంచి ఫాస్ట్‌ బౌలర్లు వారికి ఉన్నారు. అయితే భారత్‌కు బుమ్రా స్థానంలో దీపక్‌ చాహర్‌ వస్తే మాత్రం స్వింగ్‌ అక్కరకొస్తుంది. ఎలాగూ అర్ష్‌దీప్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ ఉండటం కలిసొచ్చే అంశం. కానీ పాక్‌తో పోలిస్తే మాత్రం మన పేస్‌ దళం కొంచెం వీక్‌గానే ఉంది. ఆసియా కప్‌లో భారత్, పాక్‌ మధ్య అద్భుతమైన మ్యాచ్‌లను చూశాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీమ్‌ఇండియా కాస్త పరిపూర్ణత సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగత ప్రదర్శనల మీద కాకుండా జట్టుగా రాణించడంపైనే భారత్‌ దృష్టిసారించింది’’ అని సంజయ్‌ బంగర్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని