Virat Kohli: ‘కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే తేలికైన మార్గం’

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్‌ ఆడటంతోనే అతడు ఫామ్‌లోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు...

Published : 02 Aug 2022 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్‌ ఆడటంతోనే అతడు ఫామ్‌లోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీమ్‌ఇండియా జట్టులో టాప్‌ఆర్డర్‌లో వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు కారణం కేఎల్‌ రాహుల్‌ గాయం బారినపడటం ఒకటైతే.. మరొకటి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి నివ్వడం. దీంతో టాప్‌ఆర్డర్‌లో యువ బ్యాట్స్‌మెన్‌ తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తోడుగా ఓపెనర్‌ అవతారమెత్తాడు. అంతకుముందు రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు కూడా పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్లుగా వచ్చారు. ఈ విషయంపైనే స్పందించిన పార్థివ్‌ పటేల్‌.. టీమ్‌ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచాలని చూస్తున్నందునే ఇలా యువకులకు ఓపెనర్లుగా అవకాశం ఇస్తోందని చెప్పాడు. ‘కోహ్లీ వన్డే క్రికెట్‌ ఆడితే నాకు చూడాలని ఉంది. అతడు ఫామ్‌లోకి రావాలంటే ఈ ఫార్మాటే తేలికైన మార్గం. 50 ఓవర్ల ఆటలో చాలా సమయం ఉంటుంది. ధావన్‌, శుభ్‌మన్‌ కూడా ఇలాగే వన్డే క్రికెట్‌లో ఫామ్‌లోకి వచ్చారు. వాళ్లిద్దరూ ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో బంతికో పరుగు చొప్పున రాబట్టారు’ అని పటేల్‌ చెప్పుకొచ్చాడు.

‘క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఒక దిగ్గజం. మనం ఇప్పుడు చూస్తున్న మార్పులన్నీ ఓపెనింగ్‌ విభాగంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా టీమ్‌ఇండియా కోహ్లీని తుది జట్టులో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే. అందుకే సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్‌ వంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపిస్తున్నారని నేను అనుకుంటున్నా’ అని పటేల్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, విరాట్‌ కొద్ది కాలంగా సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, అతడికి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు ప్రస్తుత విండీస్‌ పర్యటనలో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని