SA vs BAN: డికాక్ భారీ శతకం.. క్లాసెన్, మిల్లర్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోరు

సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. తాజాగా మరో శతకం సాధించాడు.

Updated : 24 Oct 2023 18:45 IST

ముంబయి: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) తన సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. తాజాగా మరో శతకం సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ (174; 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ శతకం బాదగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (90; 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (34*; 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో డికాక్‌, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్ మహమూద్‌ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (12; 19 బంతుల్లో), వన్‌డౌన్‌లో వచ్చిన వాండర్ డసెన్ (1) విఫలమయ్యారు. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్‌ను ఆరో ఓవర్‌లో షోరిఫుల్‌ ఇస్లామ్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డసెన్‌ను మెహదీ హసన్ మిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం డికాక్, మార్‌క్రమ్‌ నిలకడగా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్ 47 బంతుల్లో, మార్‌క్రమ్ 57 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. భారీ ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించిన మార్‌క్రమ్‌.. షకీబ్‌ అల్‌ హసన్ బౌలింగ్‌లో లిట్టన్‌ దాస్‌కు చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో డికాక్ గేర్లు మార్చి ఆడాడు. షోరిఫుల్ వేసిన 42 ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్‌ బాదిన అతడు.. షకీబ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో 6, 4, 6, 4 బాదేసి 150ల్లోకి వచ్చేశాడు.

షోరిఫుల్ వేసిన మరో ఓవర్‌లో డికాక్ వరుసగా రెండు బౌండరీలు రాబట్టగా.. క్లాసెన్ సిక్స్ కొట్టాడు. డబుల్‌ సెంచరీపై కన్నేసిన డికాక్‌ను హసన్‌ మమమూద్‌ ఔట్ చేశాడు. డికాక్ ఔటైన తర్వాత క్లాసెన్ మరింత ధాటిగా ఆడాడు. మహమూద్‌ బౌలింగ్‌లో సిక్స్ బాదిన క్లాసెన్.. ముస్తాఫిజుర్ వేసిన 47 ఓవర్‌లో వరుసగా 6,4,6 దంచాడు. మిల్లర్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. షోరిఫుల్ వేసిన 49 ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. మహమూద్‌ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాదిన క్లాసెన్ తర్వాతి బంతికే మహ్మదుల్లాకు క్యాచ్‌ ఇచ్చాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని