Rahul Dravid: నా కాంట్రాక్ట్‌ ముగిసింది.. దాని గురించి ఇప్పుడేం చెప్పలేను: ద్రవిడ్

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌ తర్వాత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది.

Updated : 20 Nov 2023 10:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India) వన్డే ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా అధికారికంగా ముగిసింది. బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్రకారం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. తన రెండేళ్ల కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు. దీంతో అతడిని కొనసాగిస్తారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 

‘‘ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదు. దాని గురించి తీరికా లేదు. మెగా టోర్నీపైనే దృష్టిసారించాం. సమయం ఉండుంటే ఆలోచించి ఉండేవాడినేమో. కానీ, వన్డే ప్రపంచకప్‌ సమయంలో మా దృష్టంతా దీనిపైనే ఉంచాం. ఇక నా రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటా. ఇలాంటి జట్టుతో పని చేసినందుకు గర్వపడుతున్నా. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో గౌరవంగా భావిస్తున్నా’’ అని ద్రవిడ్ తెలిపాడు.

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌నకూ..

వచ్చేఏడాది యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ దేశాల ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. దీంతో ఆ టోర్నీకి కూడా జట్టుకు కోచింగ్‌ వ్యవహారాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలు లేవు.  అలాగే 2027 ప్రపంచకప్‌ గురించి కూడా ఇప్పుడే ఆలోచించడం సరికాదు. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లరు? అనేది చెప్పడం కష్టం. దానికి చాలా సమయం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.

రోహిత్ అద్భుతమైన నాయకుడు

‘‘రోహిత్ శర్మ సూపర్‌ కెప్టెన్. వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను అద్భుతంగా నడిపించాడు. మైదానంలోనూ, డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడు. ఎప్పుడు అవసరమైనా తక్షణమే అందుబాటులో ఉంటాడు. చర్చకైనా, సమావేశాలకైనా వచ్చేస్తాడు. ప్రతి మ్యాచ్‌ కోసం ముందే పక్కాగా ప్లానింగ్‌ ఉంటుంది. అయితే, వరల్డ్‌ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. వారిని ఇలా చూడటం బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారు. కోచ్‌గా వారిని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంటుంది’’ అని ద్రవిడ్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని