Rahul Dravid: సెమీస్‌లో ఒత్తిడి.. రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర సమాధానం..

వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా ఇక సెమీస్‌ కోసం సిద్ధమవుతోంది. బుధవారం ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో తొలి సెమీ ఫైనల్‌లో భారత్ (IND vs NZ) తలపడనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 13 Nov 2023 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) వరుసగా తొమ్మిది విజయాలతో టీమ్‌ఇండియా (Team India) సెమీస్‌కు దూసుకుపోయింది. నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో కివీస్‌ చేతిలోనే టీమ్‌ఇండియా ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నాకౌట్‌లో ఒత్తిడి గురించి ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) కీలక వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్‌తో చివరి మ్యాచ్‌ అనంతరం మీడియాతో ద్రవిడ్ మాట్లాడాడు.

‘‘వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీన్ని అంగీకరించడానికి నాకేం ఇబ్బంది లేదు. అసలు ఒత్తిడే లేదని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు. చివరి వరకూ ఎవరు విజయం సాధిస్తారనే గ్యారెంటీ ఉండదు. సన్నద్ధత బాగుండి.. మైదానంలో ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ఉన్నప్పుడు అంతా బాగుంటుందనిపిస్తుంది. ఒక్క ఓటమి ఎదురైతే చాలు.. ప్రతి ఒక్కరూ ‘మీకేం తెలియదు’ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఇదంతా సహజమే. 

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా శ్రేయస్‌ ఫామ్‌ను అందుకోవడం సంతోషం. నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి కోసం గత పదేళ్లుగా కొనసాగిన అన్వేషణ కష్టంగా ఉందనేది అందరికీ తెలిసిందే. శ్రేయస్‌ రూపంలో నాణ్యమైన బ్యాటర్‌ దొరికాడు. ఇక ఈ వరల్డ్‌ కప్‌లో వరుసగా 9 మ్యాచుల్లోనూ విజయం సాధించాం. తొలి రోజు ఆట నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఆడాం’’ అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని