Ashwin: అశ్విన్‌ కెరీర్‌కు తల్లి సూచనే ‘టర్నింగ్‌ పాయింట్‌’: భారత స్పిన్నర్‌ తండ్రి

అశ్విన్‌ స్పిన్నర్‌ కాకముందు.. ఏ శైలిలో బౌలింగ్‌ వేసేవాడో తెలుసా? అదేేంటో అతడి తండ్రి రవిచంద్రన్ మాటల్లోనే తెలుసుకుందాం..

Published : 18 Feb 2024 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఐదు వందల వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మధ్యలోనే చెన్నైకి వెళ్లాడు. రెండో రోజు ఆటలోనే అశ్విన్‌ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో స్పిన్నర్‌ అతడే. తాజాగా అశ్విన్‌ తన తల్లి చిత్ర ఆరోగ్యం బాగోలేదనే కారణంతోనే వైదొలిగాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌ బౌలింగ్‌పై అతడి తండ్రి రవిచంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

‘‘అశ్విన్‌ కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్‌ పాయింట్‌ తన బౌలింగ్‌ను మార్చుకోవడమే. ఆఫ్ స్పిన్నర్‌గా బౌలింగ్‌ చేయడం మొదలుపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందుకు, నా భార్య చిత్రకు ధన్యవాదాలు చెబుతున్నా. తల్లిగా ఆమె కొడుక్కి చేసిన సూచనే కీలకంగా మారింది. కెరీర్‌ను మీడియం పేసర్‌గా ప్రారంభించిన అశ్విన్‌కు మోకాలి నొప్పి సమస్యగా ఉండేది. అతడు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు చిత్ర ‘నువ్వు ఎందుకు ఎక్కువగా పరుగులు పెడతావు? కొన్ని అడుగులు వేసి స్పిన్ బౌలింగ్‌ వేయొచ్చు కదా?’ అని అడిగింది. అప్పటినుంచి అశ్విన్‌ తన బౌలింగ్‌ తీరును మార్చుకున్నాడు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాక అశ్విన్‌తో మాట్లాడా. ఇది తప్పకుండా కెరీర్‌లో అతిపెద్ద ఘనతే. కానీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనేది అతడి అభిప్రాయం’’ అని రవిచంద్రన్ వెల్లడించారు. 

నా తండ్రికి అంకితం: అశ్విన్‌

‘‘సుదీర్ఘకాలం పాటు జాతీయ జట్టు తరఫున ఆడటం ఆనందంగా ఉంది. నేను సాధించిన ఈ ఫీట్‌ను నా తండ్రికి అంకితం చేస్తున్నా. కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచారు. నా ఆటను చూసిన ప్రతిసారీ గుండెపోటు వచ్చేలా ఉంటుంది. నా వల్ల ఆరోగ్యాన్ని కోల్పోయి ఉంటారు.. ఇప్పుడు దీనిని ఆయనకు అంకితం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని