Virat Kohli: కోహ్లీ గర్వంగా కెప్టెన్సీ వదులుకొని వెళ్లొచ్చు: పాంటింగ్

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు పగ్గాలు వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయితే, అతడు గర్వంగా ఆ స్థానం నుంచి తప్పుకోవచ్చని...

Published : 31 Jan 2022 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు పగ్గాలు వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయితే, అతడు గర్వంగా ఆ స్థానం నుంచి తప్పుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. తాజాగా ఐసీసీతో మాట్లాడిన ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం.. కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది తాను విరాట్‌తో మాట్లాడానని.. అయితే, అప్పుడు అతడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలిపాడు. మరోవైపు టెస్టుల్లో అలాగే కొనసాగుతానని కూడా తనతో అన్నాడని పాంటింగ్‌ గుర్తుచేసుకున్నాడు. కానీ, ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు పగ్గాలు వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు.

మరోవైపు విరాట్‌ టీమ్‌ఇండియా టెస్టు సారథిగా మేటి ప్రదర్శన చేశాడని ఈ ఆసీస్‌ దిగ్గజం ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నాయకత్వంతో భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడని తెలిపాడు. ముఖ్యంగా విదేశాల్లో భారత జట్టును టెస్టుల్లో మెరుగ్గా నడిపించాడని కొనియాడాడు. ‘కోహ్లీ కన్నా ముందు టీమ్‌ఇండియా గురించి ఆలోచిస్తే స్వదేశంలోనే ఆ జట్టు ఎక్కువ విజయాలు సాధించేది. అప్పటివరకు విదేశాల్లో అడపా దడపా విజయాలే నమోదు చేసేది. కానీ, కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నాక మరిన్ని విజయాలు సాధించేలా జట్టును తీర్చిదిద్దాడు. ఈ విషయంలో అతడితో పాటు జట్టంతా గర్వపడాలి’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

‘కోహ్లీని మైదానంలో ఉన్నప్పుడు ఒక గంటసేపు మ్యాచ్‌ చూస్తే చాలు. అతడు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా ఉండటానికి ఎంత ఆసక్తితో ఉంటాడో తెలుస్తుంది. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటాడు. ప్రతి మ్యాచ్‌ గెలవాలనుకుంటాడు. ఆటగాళ్ల నుంచి ఎప్పుడూ మేటి ప్రదర్శన కావాలనుకుంటాడు. అతడు ఏడేళ్ల పాటు కెప్టెన్సీ చేశాడు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా జట్టుకు కెప్టెన్‌గా చేయడం కష్టంగా ఉంటుందనిపిస్తే.. అది కచ్చితంగా టీమ్‌ఇండియానే. ఎందుకంటే అక్కడ క్రికెట్‌కు ఉండే అభిమానులు విపరీతం. ప్రతి ఒక్కరూ తమ ఆటగాళ్లు బాగా ఆడాలని ఆశిస్తారు. అందుకే విరాట్‌ గొప్ప సారథిగా నిలిచాడు. అతడు విదేశాల్లోనూ విజయాలు సాధించాడు. అందుకు గర్వంతోనే కెప్టెన్సీని వదిలివెళ్లొచ్చు’ అని ఆసీస్‌ మాజీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని