Rohit Sharma: ఐపీఎల్‌లో సిక్స్‌ల రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ

తన జట్టు పోరాడి ఓడినప్పటికీ.. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అలాగే అర్జున్‌ తెందూల్కర్‌ కూడా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Updated : 23 Apr 2023 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ముంబయి ఇండియన్స్‌ (MI vs PBKS) ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 214/8 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 201/6 స్కోరుకే పరిమితమైంది. కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (44) కూడా రాణించినా ఓటమి మాత్రం తప్పలేదు. జట్టు ఓడినప్పటికీ రోహిత్ ఖాతాలో ఓ రికార్డు చేరింది. ఐపీఎల్‌లో 250 సిక్స్‌లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించాడు. మొత్తంగా చూస్తే మూడో బ్యాటర్‌. రోహిత్ కంటే ముందు క్రిస్‌ గేల్‌ (357), ఏబీ డివిలియర్స్‌ (251) మాత్రమే ఉన్నారు. భారత్‌ నుంచి రోహిత్ కాకుండా ఎంఎస్ ధోనీ (235), విరాట్ కోహ్లీ (229) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇప్పటి వరకు 233 మ్యాచుల్లో 6,058 పరుగులు చేసిన రోహిత్‌ 130.22 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.

అర్జున్ ఖాతాలో చెత్త రికార్డు

సొంతమైదానంలో వికెట్‌ సాధించిన అర్జున్‌ తెందూల్కర్‌ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన రెండో ముంబయి బౌలర్‌గా మారాడు. పంజాబ్‌పై ఇన్నింగ్స్‌లోని 16వ ఓవర్‌ వేసిన అర్జున్‌ నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు,వైడు, నోబాల్‌, సింగిల్‌తో కలిపి 31 పరుగులు సమర్పించాడు. ముంబయి తరఫున అత్యధికంగా డేనియల్ సామ్స్ 2022 సీజన్‌లో కోల్‌కతాపై ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరి తర్వాత పవన్‌ సూయల్, అల్జారీ జోసెఫ్‌, మెక్‌క్లాగెన్‌ 28 పరుగులు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని