Rohit - Cummins: కమిన్స్ అలా వచ్చి ఇలా ఆడతాడని ఎప్పుడూ ఊహించలేదు: రోహిత్‌

టీ20 మెగా లీగ్‌లో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) చెలరేగడంతో ముంబయి ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌ను కోల్పోయింది...

Published : 07 Apr 2022 09:23 IST

పుణె: టీ20 మెగా లీగ్‌లో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) చెలరేగడంతో ముంబయి ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ విషయంపై మాట్లాడిన ముంబయి సారథి రోహిత్‌ శర్మ.. కమిన్స్‌ ఇలా ఆడతాడని ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కుతుందని చెప్పాడు.

‘మ్యాచ్‌ జరిగేకొద్దీ బ్యాట్స్‌మెన్‌ చెలరేగేందుకు అనుకూలంగా పిచ్‌ మారింది. మొత్తంగా ఇది చాలా మంచి పిచ్‌. అయితే, మేం బ్యాటింగ్‌లో తొలుత సరిగ్గా ఆడలేకపోయాం. కానీ, చివరి 5 ఓవర్లలో 70కిపైగా పరుగులు సాధించాం. అదంతా మా బ్యాటింగ్‌ బృందం కృషి అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్‌లో మా ప్రణాళికల పరంగా బౌలింగ్‌ చేయలేకపోయాం. కోల్‌కతా బ్యాటింగ్‌ చేసేటప్పుడు 15 ఓవర్ల దాకా పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కమిన్స్‌ వచ్చి మ్యాచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. మంచి పరుగులు సాధిస్తే ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. ఒక దశలో వారివి 5 వికెట్లు తీశాం. కానీ.. వెంకటేశ్‌, కమిన్స్‌లను ఔట్‌ చేయలేకపోవడమే మ్యాచ్‌ను దూరం చేసింది. ఈ ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇకపై మేం కష్టపడాల్సింది చాలా ఉంది. ఎప్పుడూ నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని నచ్చదు’ అని రోహిత్‌ వివరించాడు.

ఇక కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ఈ రోజు కమిన్స్‌ ఆడిన తీరును తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఎందుకంటే నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు మాటిమాటికీ బౌల్డయ్యాడని తెలిపాడు. అప్పుడు కమిన్స్ పక్కనే తాను ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పాడు. ఆ సమయంలో కమిన్స్ ప్రతి బంతిని దంచికొట్టాలని చూశాడని, అప్పుడు తాను బంతి టైమింగ్‌ని బట్టి షాట్లు ఆడాలని సూచించినట్లు చెప్పాడు. కాగా, లక్ష్య ఛేదనలో కోల్‌కతా 15 ఓవర్లకు 127/5తో ఉండగా డేనియల్‌ సామ్స్‌ వేసిన 16వ ఓవర్‌లో కమిన్స్‌ రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 6, 6, 2 నోబాల్‌, 4, 6 ఆరు బంతుల్ని బౌండరీలకు తరలించాడు. దీంతో ఈ ఒక్క ఓవర్‌లో మొత్తం 35 పరుగులు రాబట్టి ముంబయి ఊహించని షాకిచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని