IND vs PAK: దాయాదితో పోరు.. ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపా: సచిన్‌

పాకిస్థాన్‌పై సచిన్ తెందూల్కర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరీ ముఖ్యంగా 2003 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై వీరవిహారం ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోలేం. కానీ, ఆ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి నిద్రపట్టలేదని సచిన్‌ తెందూల్కర్‌నే చెప్పడం గమనార్హం.

Published : 17 Mar 2023 18:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాయాదుల మధ్య (IND vs PAK) పోరంటే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది మ్యాచ్‌లో తలపడే ఆటగాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం సహజం. క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin) కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నాడట. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  2003 వన్దే ప్రపంచకప్‌ సందర్భంగా భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌కు ముందు తనకు నిద్ర కూడా కరవైందని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు.

‘‘భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అలాంటి మ్యాచ్‌కు ముందు నేను నిద్రపోలేదు. ఇతర మ్యాచుల్లో గెలిచినా గెలవకపోయినా ఫర్వాలేదుగానీ పాక్‌పై టీమ్‌ఇండియా గెలవాలని అభిమానులు బలంగా కోరుకుంటారు. అందుకే ఇలాంటి మ్యాచ్‌పై అంచనాలు, ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇక షోయబ్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ నా జీవితంలో ప్రత్యేకమైన షాట్. అయితే, ఇలాంటి షాట్‌ కొట్టాలన్న ముందస్తు ప్రణాళికతో బరిలోకి దిగలేదు. బంతి గమనాన్ని అంచనా వేస్తూ అప్పటికప్పుడు అలాంటి షాట్ ఆడేయాలి. ఆ మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. బంతి ఆఫ్‌సైడ్‌కు ఆవల వెళ్తున్నట్లు అనిపించింది. వెంటనే షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించా. అది సిక్స్‌గా వెళ్లిపోయింది’’ అని సచిన్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ 98 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, పాక్‌పై విజయం సాధించడంలో ఆ ఇన్నింగ్స్‌ కీలకంగా మారింది. 

నంబర్‌వన్‌గా టెస్టు క్రికెట్‌.. 

ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లోనూ దూకుడు పెరిగింది. సుదీర్ఘ ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌ నంబర్‌వన్‌గా కొనసాగేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే అంశంపైనా సచిన్‌ స్పందించాడు. ‘‘ఇప్పుడు మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. టెస్టు క్రికెట్‌పై ఆసక్తిగా ఉండాలి తప్ప.. ఎన్ని రోజుల్లో అంతర్థానం అవుతుందనే అంశం గురించి అస్సలు చర్చించకూడదు. టెస్టు క్రికెట్‌ మరింత ఆసక్తిగా మారాలంటే వేర్వేరు పిచ్‌ పరిస్థితులపై ఆడాలి. పేస్‌ బౌలింగ్, స్వింగ్‌, స్పిన్.. ఇలా విభిన్నంగా బంతులను ఎదుర్కోవాలి. అప్పుడే టెస్టు క్రికెట్‌పై ఆటగాళ్లలోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడున్న మరో రెండు ఫార్మాట్లు (టీ20లు, వన్డేలు) బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టీ20ల్లో ప్రతి బంతినీ కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వన్డేల్లోనూ 320 పరుగులు అంటే సాధారణ స్కోరుగా మారిపోయింది’’ అని సచిన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని