IPL: అత్యంత రిచెస్ట్‌ టోర్నీని మా దగ్గర పెట్టండి.. ఐపీఎల్‌ యజమానులకు సౌదీ ఆఫర్!

ఐపీఎల్‌ కంటే రిచెస్ట్‌ లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులకు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Published : 15 Apr 2023 02:03 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ ప్రపంచంలో సంపాదనపరంగా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) టాప్‌లో ఉంటుంది. బిగ్‌బాష్‌ లీగ్‌, కరేబియన్ లీగ్‌, పాక్‌ సూపర్ లీగ్‌తోపాటు ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లకు ప్రజాదరణ పెరగడంతో సౌదీ అరేబియా కూడా ఇదే బాటలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తమ దేశంలోనూ భారీ లీగ్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులకు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క పాక్‌ మినహా ఐసీసీ సభ్య దేశాల నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌ కంటే రిచెస్ట్‌ లీగ్‌ను సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయడానికి ఈ ఆఫర్‌ను ఐపీఎల్ నిర్వాహకులు బీసీసీఐతోపాటు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్లకు అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్లు సమాచారం. అయితే, భారత క్రికెటర్లను ఇతర దేశాల్లోని లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో సౌదీ రిక్వెస్ట్‌ను బీసీసీఐ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. 

అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొనే లీగ్‌కు ఐసీసీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, సంవత్సరం నుంచి సౌదీ అరేబియా ప్రభుత్వం క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్‌ బార్‌క్లే కూడా సౌదీ ఆసక్తిగా ఉందని ధ్రువీకరించారు. ‘‘సౌదీ అరేబియాను క్రికెట్‌ బాగా ఆకట్టుకుంది. దీంతో ఇతర క్రీడలతో పాటు క్రికెట్‌ను విస్తరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అందుకోసం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. 2016 నుంచి ఐసీసీ అసోసియేట్‌ సభ్య దేశంగా సౌదీ అరేబియా కొనసాగుతోంది. 

ఒకవేళ లీగ్‌ సాధ్యపడలేదంటే.. కనీసం ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌ను కానీ.. ఐపీఎల్‌లోని ఒక రౌండ్‌ మ్యాచ్‌లను సౌదీ అరేబియాలో నిర్వహించే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే సౌదీ ప్రభుత్వం, వ్యాపారవేత్తలు భారత క్రికెట్‌ కార్యకలాపాల భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. 


 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని