IPL 2024: ఐపీఎల్ 2024.. ఆరంభ మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్ దూరం..!

ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) కోసం జట్లన్నీ సమాయత్తం అవుతున్న వేళ.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.

Updated : 14 Mar 2024 10:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ (IPL 2024) ప్రారంభమవుతున్న వేళ.. ఫ్రాంచైజీలకు గాయాలు, వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరం కావడం తలనొప్పిగా మారింది. తాజాగా  కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చనే కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో శ్రేయస్‌ ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 95 పరుగులు చేశాడు. అయితే, మళ్లీ తన వెన్ను నొప్పి తిరగబెట్టిందని.. రంజీ ఫైనల్‌ ముగిసిన తర్వాత కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

‘‘శ్రేయస్‌ అయ్యర్‌కు వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఐదో రోజు మైదానంలోకి దిగలేదు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి’’ అని క్రీడా వర్గాలు తెలిపాయి. గతేడాది ఇదే సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని వన్డే వరల్డ్‌ కప్‌ నాటికి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలో మరోసారి వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టింది. కాస్త కోలుకోవడంతో రంజీ ఫైనల్‌లో ఆడుతున్నాడు. ఒకవేళ శ్రేయస్ అందుబాటులో లేకపోతే కోల్‌కతా యాజమాన్యం మళ్లీ నితీశ్‌ రాణాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? కొత్తగా ఎవరినైనా కెప్టెన్‌ చేస్తుందో చూడాలి.  ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్చి 23న తలపడనుంది. మార్చి 29న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఏప్రిల్ 3న దిల్లీ క్యాపిటల్స్‌తో కేకేఆర్‌ ఆడనుంది. 

ఇదే అతిపెద్ద వివాదం: ఏబీ డివిలియర్స్

ముంబయి ఇండియన్స్‌ సారథిగా హార్దిక్‌ పాండ్యను నియమిచడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. ‘‘ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్‌ ఒకటి. ఐదుసార్లు విజేతగా నిలిచారు. హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా చేసినప్పటి నుంచి అతిపెద్ద వివాదంగా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుండటం మరింత ఆసక్తి కలిగించనుంది’’ అని ఏబీడీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని