Mohammed Siraj: సిరాజ్‌ మియా.. మళ్లీ నంబర్‌ వన్‌

ఆసియా కప్‌ ఫైనల్‌లో సంచలన ప్రదర్శనతో టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

Updated : 20 Sep 2023 16:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ ఫైనల్‌లో సంచలన బౌలింగ్‌తో టీమ్‌ఇండియా సీమర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అతడు ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్ ర్యాంక్‌ను అందుకోవడం విశేషం. అతడు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో సిరాజ్‌ భారత వన్డే చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా బౌలింగ్‌ చేశాడు. అతడి ధాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన ఘనత అందుకొన్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా (6/21)తో కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

హేజిల్ వుడ్ రెండో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్‌ మూడో స్థానంలో ఉన్నారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు ముజీబుర్ రెహ్మన్, రషీద్‌ఖాన్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.  

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్‌ హెన్రిచ్ క్లాసెన్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో క్లాసెన్ (174; 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌ (277)గా నిలిచిన డేవిడ్ మలన్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ (13) అందుకున్నాడు. పాక్ బ్యాటర్‌ బాబర్‌ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమ్‌ఇండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్, సౌతాఫ్రికా బ్యాటర్ డసెన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని