IPL 2023: పృథ్వీ షా.. ఈసారి ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులోకి రావడం ఖాయం: గంగూలీ

ఆటపరంగా సూపర్‌ టాలెంట్‌.. అయితే వివాదాలు కమ్మేయడంతో యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఐపీఎల్ 16వ సీజన్‌లో రాణించడం అతడి కెరీర్‌కు చాలా కీలకం.  

Published : 28 Mar 2023 19:16 IST

ఇంటర్నెట్ డెస్క్: పృథ్వీ షా (Prithvi Shaw).. దాదాపు రెండేళ్ల కిందట టీమ్‌ఇండియా తరఫున చివరిసారిగా మైదానంలో అడుగు పెట్టిన యువ ఆటగాడు. అవకాశాల కోసం వేచి చూస్తూనే ఉండిపోయాడు. ఐపీఎల్‌, దేశవాళీ టోర్నీల్లో రాణించినప్పటికీ జాతీయ జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోతున్నాడు. దేశీయ క్రికెట్‌లో భారీ స్కోర్లు చేసినా జట్టులో చోటు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో పృథ్వీషాకి మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే తిరుగుండదని చెప్పారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా పృథ్వీషాకు భరోసానిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భారత్‌ తరఫున ఆడేందుకు పృథ్వీ షా సిద్ధంగా ఉన్నాడు. అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నిరూపించుకుంటాడు. కానీ, అతడు ఆడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. పృథ్వీపై కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్టర్లు దృష్టి పెడతారని అనుకుంటున్నా. షా నాణ్యమైన ఆటగాడు’’ అని గంగూలీ తెలిపాడు. గతంతో పోలిస్తే పృథ్వీ షా మరింత నాణ్యంగా మారాడని, తప్పకుండా ఈసారి ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందని ఆసీస్‌ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్ రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. ఓపెనర్‌గా రాణించే పృథ్వీ షాకు జట్టులో స్థానంపై సందిగ్ధత నెలకొంది. వన్డేల్లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు బరిలోకి దిగేందుకు శుభ్‌మన్‌ గిల్‌, సీనియర్‌ బ్యాటర్ శిఖర్ ధావన్‌, ఇషాన్‌ కిషన్‌ తదితరులు పోటీ పడుతున్నారు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న పృథ్వీ ఇప్పటి వరకు 68 మ్యాచుల్లో 1,588 పరుగులు చేశాడు. ఇటీవల సెల్ఫీ వివాదంలో పృథ్వీ షా చిక్కుకున్న విషయం తెలిసిందే. వివాదాలన్నింటినీ పక్కన పెట్టేసి పదహారో సీజన్‌ ఐపీఎల్‌ పోటీల్లో రాణిస్తేనే భారత జట్టు తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని