
IND vs SA: టీమ్‌ఇండియా పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం : దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత జట్టు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్నా.. ఇండియా-ఏ జట్టును బీసీసీఐ వెనక్కి పిలవకపోవడం సాహసోపేత నిర్ణయమని ప్రశంసించింది. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో అనధికారిక టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే.. భారత సీనియర్ ఆటగాళ్ల బృందం డిసెంబరు 9న దక్షిణాఫ్రికా బయలుదేరనుంది. ‘టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఆరోగ్యం పట్ల దక్షిణాఫ్రికా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం పర్యటనలో ఉన్న జూనియర్ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లను కూడా బయో బబుల్‌లో ఉంచి మెరుగైన రక్షణ కల్పిస్తాం. చాలా దేశాలు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్న నేపథ్యంలో ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండటం చాలా గొప్ప విషయం. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న బీసీసీఐకి ధన్యవాదాలు’ అని దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి ముంబయి వేదికగా ప్రారంభం కానుంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం : అరుణ్ ధూమల్
టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు మేం పూర్తి సహకారం అందిస్తాం. అయితే, ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో మాత్రం రాజీపడబోం. ప్రస్తుతానికైతే, ఆటగాళ్లను ఛార్టర్డ్ ఫ్లైట్‌లో జోహన్నెస్‌బర్గ్ తీసుకెళ్లి.. బయో బబుల్‌లో ఉంచాలని నిర్ణయించాం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వేదికల మార్పు గురించి చర్చలు జరుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ పేర్కొన్నారు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.