PAK vs SA: ఉత్కంఠ పోరు.. ఒక వికెట్‌ తేడాతో పాక్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా

తీవ్ర ఉత్కంఠ రేపిన కీలక పోరులో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 

Updated : 27 Oct 2023 23:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. అయిడెన్‌ మార్‌క్రమ్‌ (91: 93 బంతుల్లో 7×4,3×6)) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఇక పాకిస్థాన్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బోల్తాపడింది. మొత్తం ఆరు మ్యాచుల్లో ఐదింట గెలిచిన దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్‌ బౌలర్లలో అఫ్రిది 3, మహ్మద్‌ వాసిమ్‌, రవూఫ్‌, ఉసామా మిర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

చెలరేగిన మార్‌క్రమ్‌..   

ఈ ప్రపంచకప్‌లో భారీ స్కోర్లతో అదరగొడుతున్న దక్షిణాఫ్రికాకు 271 పరుగులు పెద్ద లక్ష్యం కాదు. అయితే సూపర్‌ఫామ్‌లో ఉన్న డికాక్‌ (24: 14 బంతుల్లో) ఐదు ఫోర్లు కొట్టి చెలరేగాడు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద షహీన్‌కు చిక్కాడు. దీంతో క్రీజులోకి వచ్చిన డస్సెన్‌(21)తో కలిసి మరో ఓపెనర్‌ బవుమా(28) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 67 పరుగుల వద్ద బవుమా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్‌(91)తో కలిసి డస్సెన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 121 పరుగుల వద్ద డస్సెన్‌ ఉసామా మిర్‌కు చిక్కాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్‌ చెలరేగి ఆడాడు. అయితే ఫామ్‌లో ఉన్న క్లాసెన్‌(12), మిల్లర్‌(29), జాన్‌సెన్‌(20) తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టారు. అయినప్పటికీ సాధించాల్సిన పరుగులు తక్కువే ఉండడం, క్రీజులో ఉన్న మార్‌క్రమ్‌ సెంచరీ వైపు దూసుకెళ్తుండడంతో దక్షిణాఫ్రికా సులువుగానే విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే జట్టు స్కోరు 250 పరుగుల వద్ద మార్‌క్రమ్‌, గెర్లాడ్‌ ఔట్‌ కావడంతో సఫారీల కథ అడ్డం తిరిగింది. చేతిలో రెండు వికెట్లు, సాధించాల్సినవి 21 పరుగులే అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో 260 పరుగుల వద్ద ఎంగిడి రూపంలో వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. అయితే ఒత్తిడిని చిత్తు చేస్తూ 48వ ఓవర్లలో కేశవ్‌ మహరాజ్‌ ఫోర్‌ కొట్టడంతో పాక్‌ ఆశలు ఆవిరయ్యాయి. 

అర్ధశతకాలతో ఆకట్టుకున్న బాబర్‌, షకీల్‌..

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు అలౌటైంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (9), ఇమామ్‌ అల్‌ హక్‌ (12) నిలకడగా ఇన్నింగ్స్‌ ప్రారంభించినా సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఈ ఇద్దరినీ జేన్‌సన్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత బాబర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (31) మధ్య చక్కటి పార్ట్‌నర్‌షిప్‌ దొరికింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద రిజ్వాన్‌ను కొయిట్జీ బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (21)తో కలసి బాబర్‌ అజామ్‌(50) స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరి భాగస్వామ్యంతో భారీ స్కోరువైపు వెళ్తోంది అనుకునేలోపే 12 పరుగుల తేడాతో ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. ఈ రెండు వికెట్లు షంసీ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత షాదాబ్‌ ఖాన్‌(43), సౌద్ షకీల్‌(52) జట్టును భారీ స్కోరు వైపు తీసుకెళ్లారు. షాట్‌లతో షాదాబ్‌ విరుచుకుపడితే, సౌద్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే ఈ ఇద్దరూ కీలక సమయంలో ఔటైపోయారు. ఆ తర్వాత వచ్చిన మహ్మద్‌ నవాజ్‌ (24) కొన్ని భారీ షాట్లు కొట్టినా... లోయర్‌ ఆర్డర్‌ నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో పాక్‌ 270 పరుగులకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని