SL vs AFG: అఫ్గాన్‌ ‘సూపర్‌’ పోరాటం.. చివర్లో పుంజుకుని గెలిచిన శ్రీలంక

ఆసియా కప్‌లో సూపర్‌-4 బెర్త్‌ కోసం అఫ్గాన్‌ జట్టు గొప్పగా పోరాడింది. అయితే చివర్లో పుంజుకున్న లంక జట్టు అఫ్గాన్‌ ఆశలు ఆవిరి చేయడమే కాకుండా 2 పరుగుల తేడాతో గెలిచి సూపర్‌-4కు దూసుకెళ్లింది. 

Updated : 05 Sep 2023 23:25 IST

లాహోర్‌: ఆసియా కప్‌లో భాగంగా సూపర్‌-4లో చోటుకోసం అఫ్గాన్‌, శ్రీలంక చావోరేవో అన్నట్లు పోరాడాయి. గొప్పగా పోరాడిన అఫ్గాన్‌ గెలుపుతీరాలకు వెళ్లి చివరి మెట్టు వద్ద బోల్తా పడింది. ఇక ఆసియా కప్‌ ఆశలు దూరం అవుతున్న సమయంలో పుంజుకున్న శ్రీలంక సూపర్‌-4 బెర్త్‌ దక్కించుకోవడమే కాకుండా మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అఫ్గాన్‌ సూపర్-4కు అర్హత సాధించాలంటే 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో అఫ్గాన్‌ 37 ఓవర్లకు 289/8 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాతి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో వికెట్ కోల్పోవడంతో అఫ్గాన్‌ సూపర్‌-4 ఆశలు ఆవిరయ్యాయి. తర్వాత 37.4 ఓవర్ల వద్ద చివరి వికెట్‌ను కోల్పోయి ఆలౌట్‌ అయింది. దీంతో శ్రీలంక రెండు పరుగుల తేడాతో గెలిచి సూపర్‌-4కు దూసుకెళ్లింది.  

బౌండరీల వర్షం కురిపించిన నబీ..

లక్ష్యఛేదనలో అఫ్గాన్‌ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రహమత్‌ షా (45; 40 బంతుల్లో), హస్మతుల్లా షాహిది (59; 66 బంతుల్లో) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. తర్వాత మహమ్మద్‌ నబీ (65; 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌండరీల వర్షం కురిపించడంతో అఫ్గాన్‌ వడివడిగా విజయం దిశగా సాగింది. నబీ ఔటైన తర్వాత కరీమ్ జనత్ (22,; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), నజిబుల్లా జర్దాన్‌ (23; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో అఫ్గాన్‌ విజయానికి చేరువైంది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్‌ ఆటగాళ్లు ధాటిగా ఆడుతుండడంతో శ్రీలంక శిబిరంలో ఆందోళన చెలరేగింది. చివర్లో రషీద్‌ ఖాన్‌ (27*; 16 బంతుల్లో  4 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. 

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పాథూమ్‌ నిశాంక (41; 40 బంతుల్లో 6 ఫోర్లు), డిముత్‌ కరుణరత్నె (32; 35 బంతుల్లో 6 ఫోర్లు) శుభారంభం అందించారు. అనంతరం ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ (92; 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఆల్‌రౌండర్‌ చరిత్ అసలంక (36) ఫర్వాలేదనిపించాడు. 227 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. టెయిండర్లు వెల్లలాగే (33), మహీశ్ తీక్షణ (28) గొప్పగా పోరాడటంతో భారీ స్కోరు సాధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని