IND vs PAK: రఫ్ఫాడించిన రోహిత్‌.. పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

india vs pakistan: వన్డే ప్రపంచంలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Updated : 14 Oct 2023 21:11 IST

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని  ప్రదర్శించింది. వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడిన ఏడుసార్లు విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India).. ఎనిమిదో మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డును పదిలం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో అదరగొట్టి పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని  ఛేదించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శ్రేయస్ అయ్యర్ (53*; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. కేఎల్‌ రాహుల్‌ (19*; 29 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు. శుభ్‌మన్ గిల్ (16; 11 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. కోహ్లీ (16; 18 బంతుల్లో 3 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, హసన్‌ అలీ ఒక వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. గురువారం (అక్టోబర్ 19) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

సిక్సర్లతో విరుచుకుపడ్డ రోహిత్ 

శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన రోహిత్‌ ఆదినుంచీ దూకుడుగా ఆడాడు. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతినే బౌండరీకి పంపాడు. హసన్‌ అలీ వేసిన తర్వాతి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన గిల్‌.. షాహీన్‌ వేసిన మూడో ఓవర్‌లో షాదాబ్‌ ఖాన్‌కు చిక్కాడు. మరోవైపు, రోహిత్‌ మాత్రం నిలకడగా బౌండరీలు బాదాడు. హసన్‌ అలీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు రాబట్టిన హిట్‌మ్యాన్‌..షాహీన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. ఇదే ఓవర్‌లో కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. నవాజ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో సిక్స్‌ బాదిన రోహిత్‌.. హారిస్‌ రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి వన్డేల్లో 300 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. అయితే, హసన్‌ అలీ వేసిన పదో ఓవర్‌లో  కోహ్లీ నవాజ్‌కు చిక్కాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్‌తో జతకట్టిన రోహిత్ 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా హిట్‌మ్యాన్‌ దూకుడు కొనసాగింది. రవూఫ్‌, షాదాబ్‌ బౌలింగ్‌లో ఒక్కో సిక్స్‌ బాదాడు. షాదాబ్‌ వేసిన 20 ఓవర్‌లో ఫుల్ టాస్‌గా వచ్చిన బంతిని హిట్‌మ్యాన్‌ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచిన తీరు చూసి తీరాల్సిందే. శతకం దిశగా సాగుతున్న రోహిత్‌.. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఇప్తికార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కేఎల్‌తో కలిసి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అప్పటికే అర్ధ శతకానికి చేరువైన అయ్యర్‌కు రాహుల్‌ సహకారం అందించాడు. అయ్యర్ నవాజ్‌ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకుని జట్టుకు విజయాన్ని అందించాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బాబర్ అజామ్ (50) అర్ధశతకం సాధించగా.. మహమ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్‌ ఉల్ హక్ (36) రాణించారు. అబ్దుల్లా షఫిఖ్‌ (20) పరుగులు చేశాడు. మిగతా వారిలో సాద్‌ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4), షాదాబ్‌ ఖాన్ (2) ఘోరంగా విఫలమయ్యారు. ఒకదశలో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన పాక్‌.. 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్‌ యాదవ్, హార్దిక్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని