
IND vs NZ: విరాట్ ముంబయి టెస్టుకు తిరిగొస్తున్నాడు కాబట్టి..: రహానె
ఆ నిర్ణయం మేనేజ్‌మెంట్ తీసుకుంటుంది
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె స్పందించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ న్యూజిలాండ్ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. ఐదో రోజు ఆటలో చివరి సెషన్‌లో భారత విజయానికి ఆరు వికెట్లు అవసరమైన వేళ స్పిన్నర్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టి చివరి వికెట్‌ను సాధించలేక మ్యాచ్‌ను కైవసం చేసుకొనే అవకాశాన్ని కోల్పోయింది. దీనిపై స్పందించిన రహానె.. ‘ఇది చక్కటి క్రికెట్ మ్యాచ్. ప్రత్యర్థి జట్టు చాలా బాగా ఆడింది. తొలి సెషన్ తర్వాత మేం గొప్పగా పుంజుకున్నాం. చివరి వికెట్ సాధించడానికి మేం ఎంత చేయాలో అంతా చేశాం. అంతకుమించి భిన్నంగా చేయడానికేమీ లేదనే అనుకుంటున్నా. వెలుతురు మందగించడంతో ఆటను ఆపేయాలన్న అంపైర్ల నిర్ణయం సరైందే. విరాట్ ముంబయి టెస్టుకు తిరిగొస్తున్నాడు కాబట్టి తుది జట్టుపై టీమ్ మేనేజ్‌మెంట్ తర్వాత నిర్ణయం తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డాడు.