IPL 2021: వాళ్ల మీద నమ్మకముంది.. ఎలాంటి స్థితి నుంచైనా గట్టెక్కుతాం: పొలార్డ్

ముంబయి ఇండియన్స్‌ టీమ్‌లో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న ఆటగాళ్లపై పూర్తి నమ్మకముందని, ప్లేఆఫ్స్‌కు చేరే క్రమంలో వాళ్లంతా గాడిలో పడతారని ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు...

Published : 30 Sep 2021 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ టీమ్‌లో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న ఆటగాళ్లపై పూర్తి నమ్మకముందని, ప్లేఆఫ్స్‌కు చేరే క్రమంలో వాళ్లంతా గాడిలో పడతారని ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా, ముంబయి ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి పాయింట్లపట్టికలో వెనుకంజలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌పై గెలుపొంది మళ్లీ ఐదులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముంబయి మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ కోల్పోవడంపై పొలార్డ్‌ మాట్లాడాడు.

‘మా ఆటగాళ్లకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కుతామనే ఆత్మవిశ్వాసం ఉంది. మా అంతట మేమే ఈ స్థితిలో నిలిచాం. మా ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాం. అయితే, ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు నమ్మకం కలిగించి సరైన దిశలో ప్రోత్సహించాలి. ఇంతకుముందు ఈ ఆటగాళ్లు జట్టుకు ఎన్నోసార్లు విజయాలు అందించారు’ అని పొలార్డ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ముంబయి ఆటతీరుపై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ.. ‘బయట నుంచి వస్తోన్న మాటలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ క్రికెటర్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో వాళ్లు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు మాకు మేమే ప్రోత్సహించుకోవాలి. ఆటగాళ్లు బాగా ఆడేందుకు సరైన భరోసా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్లంతా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు’ అని పొలార్డ్‌ వివరించాడు.

అనంతరం యూఏఈ పిచ్‌లు ప్రపంచకప్‌లో ఎలా ఉంటాయనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం అది అనవసర విషయమని పేర్కొన్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌ జరుగుతోందని.. తాము ఈ మ్యాచ్‌లపైనే దృష్టిసారించామన్నాడు. ప్రతి ఒక్కరూ  పిచ్‌ల గురించే మాట్లాడుతున్నారని.. మనం అనుకున్నట్లు అవి ఉండవని స్పష్టంచేశాడు. ఒక క్రికెటర్‌గా ఎలాంటి పరిస్థితులనైనా అర్థం చేసుకొని ఆడాలన్నాడు. అనంతరం ఈ మ్యాచ్‌లో 45 పరుగులతో ఆదుకున్న మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సౌరభ్‌ తివారిపై స్పందిస్తూ.. అతడికి అవకాశాలిచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడని మెచ్చుకున్నాడు. అప్పుడప్పుడూ విఫలమైనా అవన్నీ ఆటలో భాగమని చెప్పాడు. ఏదైమైనా తివారి తమ జట్టుకు వెన్నెముక లాంటి  ఆటగాడని ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని