Asia Cup FootBall : వారితో ఆడటం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది : మనీషా కల్యాణ్‌

ఆసియా కప్‌ పోటీలకు ముందు దక్షిణ అమెరికన్‌ జట్లతో తలపడటం వల్ల మన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ...

Published : 03 Jan 2022 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ పోటీలకు ముందు దక్షిణ అమెరికన్‌ జట్లతో తలపడటం వల్ల మన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ మనీషా కల్యాణ్‌ తెలిపింది. గతేడాది ఆఖరున నెల రోజుల వ్యవధిలో బ్రెజిల్‌, చిలీ, వెనిజులా జట్లతో టీమ్‌ఇండియా ఆడింది. ఈ మ్యాచుల్లో ఆడటం వల్ల ఆసియా కప్‌ పోటీల ముందు మంచి సాధన చేసినట్లు అయిందని పేర్కొంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆసియా కప్‌ పోటీలు జరుగుతాయి.  ‘‘దక్షిణ అమెరికన్‌ జట్లు బ్రెజిల్, చిలీ, వెనిజులా దేశాలతో ఆడటం వల్ల మన క్రీడాకారులకు గొప్ప అనుభవం వచ్చింది. టెక్నికల్‌గా మన కంటే వారు ఎంతో మెరుగ్గా ఉంటారు. అలాంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నాం. మ్యాచ్‌ ఆసాంతం వారి మాదిరిగా వేగం కొనసాగించడం కూడా చాలా కష్టంతో కూడుకున్నదే. ఆ జట్లతో పోరాడేటప్పుడు కలిసికట్టుగా రాణించేందుకు ప్రయత్నించాం. ఓటమి ఎదురైనా మంచి ప్రదర్శనే ఇచ్చామని అనుకుంటున్నాం. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని పేర్కొంది. 

గతేడాది నవంబర్‌లో బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఏకైక గోల్‌ చేసింది. ఆ మ్యాచ్‌ 1-6 తేడాతో బ్రెజిల్‌ మీద భారత్‌ ఓడింది. అంతర్జాతీయంగా టాప్‌-10 జట్టుపై మొదటి గోల్‌ చేసిన భారతీయ క్రీడాకారిణిగా మనీషా కల్యాణ్‌ గుర్తింపు పొందింది. అదీనూ ఆమె 20వ బర్త్‌డేకు ముందు రోజు కావడం విశేషం. ‘‘నా ఫేవరెట్ టీమ్‌ బ్రెజిల్‌. రొనాల్డినో, నెయ్‌మర్ ఆటను చూస్తూ పెరిగా. బ్రెజిల్‌ ఆడే శైలి ఎంతో ప్రత్యేకమైంది. అయితే బ్రెజిల్, చిలీ, వెనిజులాతో ఆడేటప్పుడు ప్రత్యర్థి నాణ్యత గురించి ఆలోచించలేదు. విజయం కోసం చివరిదాకా పోరాడాం. ఇలా కలిసికట్టుగా ఉండే స్ఫూర్తిని నింపడం నిజంగా ఆసియా కప్‌ ముందు మాకు ఎంతో భరోసా కల్పించింది’’ అని మనీషా వివరించింది. అయితే ఫిఫా మహిళల వరల్డ్‌ కప్‌ పోటీలకు అర్హత సాధించే లక్ష్యం ఇప్పటికీ ఉందని, దానిని చేరుకునేందుకు కృషి చేస్తామని మనీషా వెల్లడించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ర్యాంకు అంతర్జాతీయంగా 55వ స్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని