Virat Kohli: విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్.. అతడికి గౌరవం ఇవ్వండి: అక్తర్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లోనూ 16 మ్యాచ్‌ల్లో 341 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 01 Jun 2022 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లోనూ 16 మ్యాచ్‌ల్లో 341 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విరాట్‌ పని అయిపోయిందని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచి అతడిపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప ప్లేయర్‌ అని.. అతడికి తగిన గౌరవం ఇవ్వాలని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు.

‘కోహ్లీని విమర్శించే ముందు వాటిని చిన్న పిల్లలు చూస్తారనే విషయాన్ని అర్థం చేసుకోండి. విరాట్‌ గురించి మంచి విషయాలు చెప్పండి. అతనికి తగిన గౌరవం ఇవ్వండి. ఒక పాకిస్థాన్‌ ఆటగాడిగా చెబుతున్నా విరాట్ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 110 సెంచరీలు చేస్తాడు. ఈ విషయంలో పందెం కాయడానికి నేను సిద్ధం’ అని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు.

‘విరాట్ కోహ్లీ.. నువ్వెవరికీ భయపడకు. 45 ఏళ్లు వచ్చే వరకు ఆడగలవు. ప్రస్తుత పరిస్థితులు నిన్ను 110 సెంచరీలు సాధించే దిశగా సిద్ధం చేస్తున్నాయి. నీ గురించి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. నువ్వు దీపావళి గురించి పోస్ట్ చేసినా విమర్శిస్తున్నారు. కొందరు నీ భార్య, చిన్నారిపై ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు. ఆ ప్రకృతే నిన్ను 110 సెంచరీలు సాధించేలా సన్నద్ధం చేస్తోంది. నా మాటలు నీ మనసులో పెట్టుకో. ఈ రోజు నుంచే నువ్వు కఠిన సాధన ప్రారంభించు’ అని అక్తర్ సూచించాడు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని