Tata group: మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. టాటాలకు ఎందుకీ సెగ..?

టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది.

Updated : 08 May 2024 16:10 IST

Tata group | ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌నకు (Tata group) చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోజుల క్రితం ఇదే గ్రూప్‌నకు చెందిన విస్తారాలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇంతకీ టాటా గ్రూప్‌నకు ఈ పరిస్థితి ఎందుకెదురవుతోంది? ఉద్యోగులు తరచూ ‘మూకుమ్మడి సెలవుల’పై ఎందుకు వెళుతున్నారు..?

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఈ గ్రూప్‌ విస్తారా విమానయాన సంస్థను నడుపుతోంది. అయితే, కొనుగోలు తర్వాత విమానయాన సంస్థలను ఏకీకృతం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (గతంలో ఎయిరేషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఈ విలీనంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంస్థగతంగా నిర్వహణ లోపాలు, ఉద్యోగులపై అనుసరిస్తున్న వైఖరిపైనా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు

ఉద్యోగుల ఆగ్రహానికి కారణం ఇదీ..

  • ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగుల సంఘం ఈ ఏడాది ఏప్రిల్‌లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. దాని ప్రకారం.. ఓ వైపు కంపెనీ లాభాల్లో కొనసాగుతున్నా.. తమకు హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్సులు తొలగించడం అన్యాయమని ఉద్యోగులు అందులో ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల తమ వేతనాలకు కోత పడుతోందని ఆవేదన వెలిబుచ్చారు.
  • ఉద్యోగులతో సంస్థ వ్యవహరిస్తున్న వైఖరిపైనా ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇంటర్నల్‌ జాబ్‌ పోస్టింగుల్లో నైపుణ్యం కలిగిన ఇంటర్నల్‌ ఉద్యోగులు ఉన్నా.. ఇతరులను నియమించడాన్ని వారు తప్పుబడుతున్నారు.
  • ఎయిరిండియాలో పైలట్లకు కొత్త వేతన విధానాన్ని టాటా గ్రూప్‌ తీసుకొచ్చింది. గతంలో 70 ఫ్లయింగ్‌ అవర్స్‌కు గానూ గ్యారెంటీ పే ఉండగా.. దాన్ని 40 గంటలకు తగ్గించింది. టాటా గ్రూప్‌ విమానయాన సంస్థలన్నింటికీ ఇదే విధానం ఉండాలని నిర్ణయించింది. ఈ మార్పు వల్ల తమ వేతన ప్యాకేజీలో కోత పడుతుందని విస్తారాలో ఫస్ట్‌ ఆఫీసర్లు, పైలట్ల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని యాజమాన్యం ఉద్యోగులకు అల్టిమేటం ఇవ్వడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. రోస్టర్‌ విధానంపైనా ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. వీక్లీ ఆఫ్‌లు ఉండడం లేదని, వ్యక్తిగత జీవితం గడపడానికి సమయం లేకపోవడం వంటి కారణాలు విస్తారాలో ఉద్యోగులు గత నెల మూకుమ్మడి సెలవులకు కారణమైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని