
Kohli - BCCI : సన్మానం అక్కర్లేదు.. బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లీ
ఇంటర్నెట్ డెస్క్ : గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వరుసగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి అతడు ముగింపు పలికాడు. బీసీసీఐ యాజమాన్యంతో పొసగకనే కోహ్లీ కఠిన నిర్ణయం తీసుకున్నాడనే వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన వాటికి బలం చేకూరుస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా 1-2 తేడాతో పరాజయం పాలైన అనంతరం.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతకు ముందే ఆ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా కోహ్లీ తెలియజేశాడు. ఇప్పటికే 99 టెస్టు మ్యాచులు పూర్తి చేసిన కోహ్లీ.. వందో మ్యాచ్‌ను తన రెండో హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో (ఐపీఎల్లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే) ఆడిన తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని సదరు అధికారి సూచించాడు. ఇన్నాళ్లూ భారత జట్టుని ముందుండి నడిపించినందుకు బీసీసీఐ కోహ్లీని ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్టు తెలిపాడు. అయితే, బీసీసీఐ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడు. ‘ఒక్క మ్యాచ్‌తో పెద్ద మార్పులేమీ రావు. అయినా, అలాంటి రికార్డులను, సెంటిమెంట్లను నేను పట్టించుకోను’ అని కోహ్లీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. శనివారం టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశపరిచిన కోహ్లీ.. టెస్టు పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Advertisement