WI vs Virat: ఏకైక బ్యాటర్‌గా రికార్డు.. సచిన్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

భారత మాజీ కెప్టెన్, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో సెంచరీ మిస్‌ చేసుకున్న విరాట్.. రెండో టెస్టులో అదరగొట్టాడు.

Published : 22 Jul 2023 09:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న (WI vs IND) రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (121) సూపర్ సెంచరీ సాధించాడు. టీమ్ఇండియా తరఫున విరాట్ కోహ్లీకిది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కాగా.. విండీస్ - భారత్‌ జట్ల మధ్య వందో టెస్టు కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ టెస్టుల్లో 29వ సెంచరీ నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లు కలిపి శతకాల సంఖ్య 76కి చేరింది. సచిన్‌ను విరాట్ ఓ రికార్డు విషయంలో అధిగమించాడు. సచిన్‌ 500 మ్యాచుల్లో 75 సెంచరీలు చేయగా.. విరాట్ 76 శతకాలతో కొనసాగుతున్నాడు. సచిన్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో 664 మ్యాచులు ఆడాడు. ఇందులో వంద శతకాలు, 201 వికెట్లు ఉన్నాయి. 

శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన అశ్విన్.. ప్రతిఘటిస్తున్న విండీస్

విరాట్ తన 500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కంటే ముందు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు  మాత్రమే 500+ మ్యాచ్‌ల క్లబ్‌లో ఉన్నారు. భారత ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. కానీ వారెవరూ తమ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ సాధించలేదు. ఆ ఘనత విరాట్‌కే దక్కింది. సచిన్‌ 35 పరుగులు, ధోనీ 32* (టీ20), రాహుల్ ద్రవిడ్  కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. 

అనుష్క స్పెషల్ పోస్టు

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ 76వ శతకం సాధించిన సందర్భంగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ప్రత్యేక పోస్టు పెట్టింది. విరాట్ సెంచరీ తర్వాత అభివాదం చేస్తున్న సమయంలో తీసిన ఫొటోపై లవ్‌ సింబల్‌ ఉంచి షేర్ చేసింది. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్‌ కాగా.. విండీస్‌ కూడా దీటుగా స్పందిస్తోంది. ప్రస్తుతం 86/1 స్కోరుతో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని