Virender Sehwag: రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చు: సెహ్వాగ్

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించొచ్చని మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. దీంతో అతడు పనిభారం తగ్గించుకునే వీలుంటుందని తెలిపాడు...

Published : 27 Jun 2022 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించొచ్చని మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. దీంతో అతడు పనిభారం తగ్గించుకునే వీలుంటుందని తెలిపాడు. గతేడాది విరాట్‌ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాక రోహిత్‌ జట్టు పగ్గాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే గాయాల కారణంగా అతడు అన్ని మ్యాచ్‌లకూ ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన సెహ్వాగ్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

‘రోహిత్‌కు ఇప్పుడున్న వయసు ప్రభావంతో టీ20ల్లో కెప్టెన్‌గా తప్పుకుంటే.. మానసికంగా బాగుండడమే కాకుండా తన పనిభారాన్ని సైతం సమన్వయం చేసుకోవచ్చు. అలాగే జట్టు యాజమాన్యం ఇంకో సారథిని నియమిస్తే అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకొని తిరిగి టీమ్‌ఇండియాను ఉత్సాహంగా వన్డేలు, టెస్టుల్లో ముందుండి నడిపించవచ్చు’ అని పేర్కొన్నాడు. అయితే, జట్టు యాజమాన్యం అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండాలని భావిస్తే కూడా రోహిత్‌ సమర్థవంతంగా నడిపించగలడని చెప్పాడు. ఇదిలా ఉండగా, ఇటీవల టీమ్ఇండియా బిజీ షెడ్యూల్‌ కారణంగా ఒకేసారి రెండు సిరీస్‌లు ఆడాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కెప్టెన్లను ఆడించింది. తొలుత గతేడాది శ్రీలంక పర్యటనలో శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో టీ20 సిరీస్‌కు వెళ్లగా అదే సమయంలో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇప్పుడు కూడా ఒక జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుండగా మరో జట్టు ఐర్లాండ్‌తో ఆడుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని