Team India in Asia Cup: ఒకసారి భారత్.. మరోసారి పాక్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?
ఇప్పటి వరకు 13 సార్లు వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ (Asia Cup) జరిగింది. మరో రెండుమార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగింది. టీమ్‌ఇండియా అత్యధిక సార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే, ఒకసారి మాత్రం ఆసియా కప్ ఆడకపోవడం గమనార్హం. అలాగే పాకిస్థాన్ కూడా పాల్గొనలేదు.
మూడు దేశాలతో ప్రారంభమైన ఆసియా కప్ (Asia Cup) ప్రస్తుతం ఆరు జట్లకు చేరింది. తొలుత 1984లో ప్రారంభమైంది. టీమ్‌ఇండియా (Team India) ఛాంపియన్‌గా నిలిచింది. అభిమానుల నుంచి అనూహ్య స్పందన రావడం.. టోర్నీ కూడా విజయవంతం కావడంతో మరో రెండేళ్లకే (1986) ముందుకొచ్చింది. అయితే, ఈసారి మాత్రం భారత జట్టు లేకుండానే జరిగిపోయింది. టీమ్‌ఇండియా స్థానంలో బంగ్లాదేశ్ వచ్చి చేరింది. స్వదేశంలో జరిగిన ఆ టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచింది. అదే విధంగా 1990 ఎడిషన్‌లో పాకిస్థాన్ ఆడలేదు. ఇలా ఆసియా టాప్ జట్లు అయిన భారత్, పాక్ ఆయా టోర్నీల్లో ఎందుకు ఆడలేదంటే?
నంబర్ -4లో విరాట్ కరెక్ట్.. ఎందుకంటే?: ఏబీ డివిలియర్స్
షార్జా వేదికగా తొలి ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్‌తోపాటు పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. అయితే, 1986లో రెండో ఎడిషన్‌నాటికి క్రికెట్ సంబంధిత వ్యవహారాలతోపాటు సివిల్ వార్ దెబ్బకు భారత్ లేకుండానే టోర్నీ జరిగింది. మూడో దేశంగా బంగ్లాదేశ్ వచ్చి చేరింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE), శ్రీలంక ప్రభుత్వ దళాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాల మధ్య శాంతిస్థాపనకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. దీంతో భారత ప్రభుత్వం క్రికెటర్ల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది. ఆసియా కప్ కోసం శ్రీలంకకు జట్టును పంపించలేదు. ఇదే కాకుండా అంతకుముందు ఏడాది (1985) సిరీస్ సందర్భంగానూ జరిగిన పరిణామాలూ భారత ఆటగాళ్లలో అసంతృప్తి నెలకొంది. కపిల్ నాయకత్వంలోని టీమ్ఇండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడాయి. కానీ, అంపైర్ నిర్ణయాల వల్ల ఫలితాలు తారుమారు కావడంతో భారత ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో శ్రీలంక వేదికగా జరిగిన 1986 ఆసియా కప్‌లో పాల్గొనకుండా మిన్నకుండిపోయింది.
పాకిస్థాన్ జట్టు కూడా..
ఆసియా కప్ 1986 ఎడిషన్‌లో భారత్ ఆడకపోవడంతో మూడో దేశంగా బంగ్లాదేశ్‌కు అవకాశం దక్కింది. తొలిసారి వన్డే ఫార్మాట్‌లోకి బంగ్లా అడుగు పెట్టడం గమనార్హం. అయితే, తర్వాత రెండేళ్లకు జరిగిన 1988 మినీ టోర్నీలో భారత్ ఆడింది. బంగ్లాదేశ్ తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. దీంతో నాలుగు జట్లతో ఆ ఆసియా కప్ జరిగింది. విజేతగా భారత్ నిలవడం విశేషం. అయితే, 1990లో మళ్లీ ఓ సమస్య వచ్చింది. ఈసారి పాకిస్థాన్ పాల్గొనలేదు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆడిన ఈ టోర్నీ విజేతగా టీమ్‌ఇండియానే నిలిచింది. భారత్‌తో రాజకీయపరమైన విభేదాలు తలెత్తడంతో పాకిస్థాన్ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. సియాచిన్ విషయంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆసియా కప్ 1990 టోర్నీలో ఆడకుండా దూరంగా ఉండిపోయింది.
ఇప్పుడూ తీవ్ర చర్చల మధ్యే..
ప్రస్తుతం జరగనున్న 16వ ఎడిషన్ విషయంలోనూ భారత్ పాల్గొనే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఏసీసీ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ ఈసారి పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, భారత్ - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. జట్టును పంపించకూడదని తొలుత బీసీసీఐ భావించింది. ఒకవేళ మ్యాచ్‌ల వేదికను మార్చేలా నిర్ణయం తీసుకుంటే టీమ్‌ఇండియా ఆడుతుందని పేర్కొంది. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు ఒకానొక దశలో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం తమ జట్టు అక్కడికి రాదని చెప్పడంతో పరిస్థితి చేయిదాటిపోయేలా అనిపించింది. దీంతో హై బ్రిడ్ మోడల్‌లో.. కొన్ని మ్యాచ్‌లు పాక్‌లో, మరికొన్ని శ్రీలంక వేదికగా నిర్వహించే ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తీసుకొచ్చింది. పాక్ సహా అన్ని జట్లూ అంగీకరించాయి. దీంతో భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.
ఏకైక జట్టు.. శ్రీలంకనే
ఇప్పటి వరకు అన్ని ఆసియా కప్ పోటీల్లో పాల్గొన్న ఏకైక జట్టు శ్రీలంకనే కావడం విశేషం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ జట్టు మాత్రం నిర్విరామంగా ఆడుతోంది. మొత్తం 12 సార్లు ఫైనల్‌కు చేరింది. ఇందులో ఆరు టైటిళ్లు ఉన్నాయి. భారత్ 10 సార్లు ఫైనల్‌కు చేరి ఏడుసార్లు విజేతగా నిలిచింది. 2004 నుంచి తొలిసారి రెండు గ్రూప్‌లు విడిపోయి మ్యాచ్‌లు ఆడటం విశేషం. అప్పట్నుంచే ఆరు జట్లు పాల్గొనే ఆనవాయితీ వచ్చింది. మధ్యలో మళ్లీ నాలుగు, ఐదు జట్లతో టోర్నీలు జరిగినా.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో మినీ టోర్నీ సిద్ధమైంది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు