Asia Cup 2023: నంబర్‌ -4లో విరాట్ కరెక్ట్‌.. ఎందుకంటే?: ఏబీ డివిలియర్స్‌

అందరూ చెబుతున్నట్లుగా ఆసియా కప్‌లో (Asia Cup 2023) నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ కానీ.. శ్రేయస్‌ అయ్యర్‌ అవసరం లేదని.. విరాట్ కోహ్లీ ఆడితే సరిపోతుందని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.

Published : 26 Aug 2023 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) బరిలోకి దిగేందుకు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. అయితే, నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిద్దరి కంటే నాలుగోస్థానంలో సరైన ఆటగాడు విరాట్ కోహ్లీనేనని ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. అప్పుడే మిడిలార్డర్‌ మరింత బలంగా మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదని పేర్కొన్నాడు. 

‘‘విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడు. ఇలాంటి అభిప్రాయం ఇంకెవరైనా చెప్పినా మద్దతుగా నిలుస్తా. అతడి గణాంకాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఇన్నింగ్స్‌ను నిలబెట్టి మిడిలార్డర్‌కు బాసటగా నిలిచే ఆటగాడు విరాట్‌ అని అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం అతడు ఈ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు. జట్టుకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఆడాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే. ఇక ఆసియా కప్‌లో పాకిస్థాన్‌, భారత్ ఫేవరేట్లు. కానీ, శ్రీలంక కూడా పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వగల సత్తా కలిగిన టీమ్‌. ఏమాత్రం అలసత్వం వహించినా గతేడాది ఫలితం పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు’’ అని ఏబీ డివిలియర్స్‌ వివరించాడు. 

జట్టు ఎంపికలో అయోమయం: క్రిష్టమాచారి శ్రీకాంత్

ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ కాస్త అంసతృప్తి వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫిట్‌గా లేని కేఎల్ రాహుల్‌ను తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అయోమయానికి గురైనట్లు పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు సరిగ్గా లేదనిపిస్తోంది. జట్టులో ఎందుకు అంతమంది మీడియం పేసర్లు? ఎవరు ఫిట్‌గా ఉన్నారనేది సెలెక్టర్లకు తెలిసినట్లు లేదు. కేఎల్ రాహుల్‌ ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని.. అతడిని ఎంపిక చేయకుండా ఉంటే బాగుండేది. సెలెక్షన్ సమయానికి ఆటగాడు ఫిట్‌గాలేకపోతే ఎంపిక చేయకుండా ఉండాలనేదే నా పాలసీ. అతడు వరల్డ్‌ కప్‌లోనూ అందుబాటులో ఉండాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఆసియా కప్‌లో రెండు గేమ్‌లు తర్వాత ఆడతాడని ఆశిస్తున్నారా? ఇదే విషయంలో అగార్కర్ కమిటీ అయోమయానికి గురైంది. ఇక యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐర్లాండ్‌పై నాలుగు ఓవర్ల స్పెల్ ఆధారంగా అతడిని ఎంపిక చేశారు. దాదాపు సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. అతడి ఎంపికా సరైందేనని మీరు భావిస్తున్నారా?’’ అని క్రిష్ ప్రశ్నించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు