IND vs BAN: విరాట్‌ కోహ్లీని స్లెడ్జ్‌ చేయను.. కారణం ఏంటంటే: ముష్పీకర్ రహీమ్‌

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 19న) భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్‌ (Mushfiqur Rahim) మాట్లాడాడు. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని తానెప్పుడూ స్లెడ్జ్‌ చేయనని పేర్కొన్నాడు.

Updated : 19 Oct 2023 07:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 19న) భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. టీమ్‌ఇండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే, బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తనదైన రోజు బలమైన జట్టుని కూడా ఓడించే సత్తా ఆ జట్టుకి సొంతం. 2007 ప్రపంచకప్‌లో భారత్‌కు బంగ్లా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్‌ (Mushfiqur Rahim) మాట్లాడాడు. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని తానెప్పుడూ స్లెడ్జ్‌ చేయనని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా ముష్పీకర్ వెల్లడించాడు. స్లెడ్జింగ్‌ (Sledging) కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, దాంతో మరింత దూకుడుగా ఆడతాడని వివరించాడు. బంగ్లాదేశ్‌తో 26 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 65.31 సగటుతో 1,437 పరుగులు చేశాడు.

‘‘ప్రపంచంలోని కొంతమంది బ్యాటర్లు స్లెడ్జింగ్‌ను ఇష్టపడతారు. అలా చేస్తే వారు మరింత ఉత్సాహంగా ఆడతారు. అందుకే, నేను విరాట్‌ కోహ్లీని ఎప్పుడూ స్లెడ్జ్ చేయను. స్లెడ్జింగ్ చేస్తే అతడు మరింత రెచ్చిపోయి ఆడతాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని మా బౌలర్లకు ప్రతిసారీ చెప్తాను. నేను భారత్‌తో బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ కోహ్లీ నన్ను స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు నిజంగా పోటీతత్వం గల క్రికెటర్‌. ఏ క్రికెట్ మ్యాచ్‌లోనూ ఓడిపోవాలని అనుకోడు. అతనితో ఉన్న ఆ పోటీని, భారత్‌ను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాల్‌ నాకెంతో ఇష్టం’’ అని ముష్పీకర్ రహీమ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని