MI vs GG: ఇద్దరే దంచేశారు.. ముంబయి ఇండియన్స్‌ లక్ష్యం 191

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Published : 09 Mar 2024 21:16 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్‌తో చివరి (ఐదో) స్థానంలో గుజరాత్ జెయింట్స్‌ తలపడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. బెత్‌ మూనీ (66; 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), దయాళన్ హేమలత (74; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారతి ఫుల్మాలి (21*; 13 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించింది.

ఓపెనర్‌ లారా వోల్వార్ట్ (13) నిరాశపర్చినా.. బెత్ మూనీ, హేమలత దూకుడుగా ఆడారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లకే స్కోరు 100 దాటింది. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. పుజా వస్త్రాకర్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదిన మూనీ.. సజనా వేసిన తొలి ఓవర్‌లో మొదటికే పెవిలియన్‌ చేరింది. తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగానికి బ్రేకులు పడ్డాయి. లిచ్‌ఫీల్డ్ (3), ఆష్లీ గార్డ్‌నర్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాసేపటికే షబ్నిమ్‌ బౌలింగ్‌లో హేమలత ఔటైంది. ఆఖర్లో భారతి దూకుడుగా ఆడటంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ 2, హేలీ మాథ్యూస్, షబ్నిమ్‌, పుజా వస్త్రాకర్, సజనా తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని