Yogeshwar Dutt: రెజ్లర్లు ఇక ఆటపై దృష్టిపెట్టాలి: యోగేశ్వర్‌ దత్‌

దిల్లీలో రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ స్పందించారు. ఆటగాళ్లు ఇక సాధనపై దృష్టిపెట్టాలని సూచించారు.  

Published : 30 Apr 2023 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిజ్‌ భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఇక రెజ్లర్లు ఆట సాధనపై దృష్టి పెట్టాలని ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌(Yogeshwar Dutt) సూచించారు. బ్రిజ్‌ భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు ఒలింపిక్‌ సంఘం నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీలో దత్‌ కూడా ఒకరు. ‘‘రెజ్లర్లు ఈ చర్యను మూడు నెలల కిందటే తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇక రెజ్లర్లు ఆట సాధనపై దృష్టిపెట్టాలి. శిక్ష విధించే అధికారం ప్రధానికి కూడా లేదు.. ఆ పని న్యాయస్థానాలే చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. కేవలం ఇరు పక్షాల వాదనలు విని నివేదికను తయారు చేసి సమర్పించడమే కమిటీ పని అని పేర్కొన్నారు.

అంతకు ముందు ఐవోఏ ఛైర్మన్‌ పీటీ ఉషా కూడా రెజ్లర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు వీధుల్లో ఆందోళనకు దిగే ముందు ఒక్కసారి ఒలింపిక్‌ అసోసియేషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. ‘‘లైంగిక వేధింపులపై విచారణకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌కు ఓ కమిటీ ఉంది. వారి (రెజ్లర్లు) సమస్యలను చెప్పడానికి ముందు మా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. వారు రాలేదు. ఇది ఆటకు, రెజ్లర్లకు మంచిది కాదు. వారు కొంచెం క్రమశిక్షణ పాటించాల్సింది’’ అని పీటీ ఉషా మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

మహిళా రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్‌ లైంగికంగా వేధించాడని వినేశ్‌ ఫొగాట్‌, సాక్షిమాలిక్‌, భజరంగ్‌ పునియా తదితరులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యంతో బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మరోవైపు పీటీ ఉషా వ్యాఖ్యలపై రెజ్లర్లు అసహనం వ్యక్తం చేశారు. ‘‘మహిళా అథ్లెట్‌ అయిన పీటీ ఉషా.. మిగిలిన మహిళా క్రీడాకారుల బాధను అర్థం చేసుకోవడంలేదు. మేము చిన్నప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందాం. మా ఆందోళనలో క్రమశిక్షణ రాహిత్యం ఎక్కడుంది. శాంతియుతంగా మేము ఇక్కడ కూర్చొన్నాం’’ అని సాక్షి మాలిక్‌ పేర్కొంది. మరోవైపు వినేశ్‌ కూడా స్పందిస్తూ పీటీ ఉష మాటలు అర్ధవంతంగా లేవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు