Wriddhiman Saha: రాహుల్‌ ద్రవిడ్‌ నన్ను రిటైరవమన్నాడు: సాహా

టీమ్‌ఇండియా సీనియర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అతడిని జట్టు కోచ్‌ రాహుల్‌ రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని సూచించినట్లు తెలిపాడు....

Updated : 20 Feb 2022 09:37 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా సీనియర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అతడిని జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని సూచించినట్లు తెలిపాడు. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు శనివారం భారత జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో సీనియర్‌ క్రికెటర్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మతో పాటు సాహాను కూడా వదిలేశారు. ఈ నేపథ్యంలోనే జట్టు యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బెంగాల్‌ క్రికెటర్‌ తనతో ద్రవిడ్‌, గంగూలీ ఏం చెప్పారో వెల్లడించాడు.

‘నన్ను ఇకపై జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని జట్టు యాజమాన్యం ముందే చెప్పేసింది. అలాగే రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని కూడా కోచ్‌ ద్రవిడ్‌ నాకు సూచించాడు. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయంతో ఇబ్బంది పడుతూనే 61 పరుగులతో అజేయంగా నిలిచాను. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నాకు వాట్సాప్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదన్నాడు. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ, ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో నాకర్థం కావడం లేదు’ అని సాహా వాపోయాడు.

జర్నలిస్టుపై సాహా అసహనం..

మరోవైపు ఈ సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ మెసేజీల స్క్రీన్‌షాట్‌ బహిర్గతం చేశాడు. అయితే, తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్‌ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది’ అని సాహా విచారం వ్యక్తం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని