Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్

వరల్డ్‌ కప్‌లో (ODI WC 2023) ఆడలేకపోవడంపై టీమ్‌ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ స్పందించాడు. అయితే, భారత్‌ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

Published : 01 Oct 2023 15:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్ కప్‌లో (ODI WC 2023) స్థానం ఆశించిన యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కలేదు. మణికట్టు మాంత్రికుడిగా చాహల్‌ను తీసుకుంటారని అంతా భావించినా.. కుల్‌దీప్‌ యాదవ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసింది. ఇప్పుడీ వరల్డ్‌ కప్‌తోపాటు అంతకుముందు టీ20 ప్రపంచ కప్‌ 2021, టీ20 ప్రపంచ కప్‌ 2022లో కూడా ఆడలేకపోయాడు. ఇలా మూడు ప్రపంచకప్‌ల్లో ఆడలేకపోవడం బాధగానే ఉన్నా.. ఇదంతా సెలెక్టర్ల నిర్ణయమేనని చాహల్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘వరల్డ్‌ కప్‌ కోసం బరిలోకి దిగాలంటే జట్టులో 15 మందికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 17 లేదా 18 మందిని తీసుకోవడం కుదరదు. అయితే, జట్టులో అవకాశం దక్కనందుకు బాధగానే ఉంది. కానీ, ఇలాంటి వాటితో బాధపడుతూ ఉండను. ఇది నేను లేని మూడో వరల్డ్‌ కప్‌ (నవ్వుతూ). జట్టులో స్థానం కోసం ఇతర స్పిన్నర్లతో పోటీ పడను. నా బౌలింగ్‌ను అత్యుత్తమంగా సంధించేందుకే ప్రయత్నిస్తా. నేను బాగా ఆడితే తప్పకుండా జట్టులోకి తీసుకుంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ సమయం వస్తుంది. భవిష్యత్తులో వారి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది.  

ప్రతిసారి సవాళ్లను ఎదుర్కోవడం నాకిష్టమే. ఇప్పుడు ప్రపంచ కప్‌ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా ఆడేవారే. భారత్‌ విజయం సాధిస్తే చాలు.. ఇదేమీ వ్యక్తిగత గేమ్‌ కాదు. నేను జట్టులో ఉన్నా లేకపోయినా.. వారంతా నా సహోదరులే. భారత్‌కే నేనే మద్దతు ఇస్తా. మళ్లీ తీవ్రంగా శ్రమించి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని చాహల్‌  వ్యాఖ్యానించాడు. మరోవైపు మాజీ క్రికెటర్లు మాత్రం చాహల్‌ను తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని