సముద్రాల్లోంచి యురేనియం వెలికితీసే పాలిమర్‌ సృష్టి

అణు విద్యుత్తు తయారీకి యురేనియం చాలా కీలకం. అయితే ఇది అపారమైన వనరేమీ కాదు. దీని లభ్యతకు పరిమితి ఉంది. చాలావరకు రాళ్ల నుంచే తవ్వి తీస్తుంటారు. నిజానికి సముద్రాల్లో సుమారు 4,500 టన్నుల యురేనియం

Updated : 08 Dec 2021 06:27 IST

ణు విద్యుత్తు తయారీకి యురేనియం చాలా కీలకం. అయితే ఇది అపారమైన వనరేమీ కాదు. దీని లభ్యతకు పరిమితి ఉంది. చాలావరకు రాళ్ల నుంచే తవ్వి తీస్తుంటారు. నిజానికి సముద్రాల్లో సుమారు 4,500 టన్నుల యురేనియం ఉంటుందని అంచనా. భూమిలో నిక్షిప్తమైన దాంతో పోలిస్తే 500 రెట్లు ఎక్కువ. కానీ నీటి నుంచి యురేనియంను వెలికి తీయటం చాలా కష్టం. ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఈ నేపథ్యంలో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ రూపొందించిన వినూత్న పాలిమర్‌ పదార్థం కొత్త ఆశలు రేపుతోంది. మన శరీరంలోని రక్తనాళాల నిర్మాణం స్ఫూర్తితో తయారుచేసిన ఇది సముద్రాల నుంచి తేలికగా యురేనియంను సంగ్రహించటానికి తోడ్పడుతుంది. గత పద్ధతులతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువగా యురేనియంను గ్రహిస్తుంది. అతి సూక్ష్మమైన గొట్టం మార్గాలకు అమిడాక్సిమ్‌ రసాయనాన్ని జోడించి దీన్ని తయారు చేశారు. అమిడాక్సిమ్‌ యురేనియం అయాన్లకు అంటుకుపోతుంది. అందువల్ల ఈ గొట్టాల్లోకి నీరు ప్రవహించినప్పుడు అందులోని యురేనియం లోపలే చిక్కుకుపోతుంది. దీన్ని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంతో శుద్ధి చేసినప్పుడు యురేనియం బయటకు వస్తుంది. పాలిమర్‌ పదార్థాన్ని చాలాసార్లు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎక్కువకాలం పనికొస్తుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని