ఎంతెంత విశ్వం?

విశాల విశ్వం పరిమాణం (సైజు) ఎంత? ఎంతవరకు విస్తరించింది? దాని అంచులేంటి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. జవాబులు కనుక్కోవటమే కష్టం. అయినా శాస్త్రవేత్తలు ప్రయత్నించటం మానలేదు. వీలైనంత వరకు శోధించి ఎన్నెన్నో విషయాలను గుర్తించారు.

Updated : 27 Jul 2023 14:35 IST

విశ్వం పరిమాణం

విశాల విశ్వం పరిమాణం (సైజు) ఎంత? ఎంతవరకు విస్తరించింది? దాని అంచులేంటి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. జవాబులు కనుక్కోవటమే కష్టం. అయినా శాస్త్రవేత్తలు ప్రయత్నించటం మానలేదు. వీలైనంత వరకు శోధించి ఎన్నెన్నో విషయాలను గుర్తించారు.

తెలిసింది గోరంత. తెలియాల్సింది కొండంత. విశ్వం విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. మనకు కనిపించే విశ్వం పరిమాణం చాలా చాలా తక్కువ మరి. సుమారు 1,380 కోట్ల ఏళ్ల క్రితం.. అపరిమిత వేడి, సాంద్రతతో కూడిన ఒకే ఒక బిందువు పేలిపోవటం (బిగ్‌ బ్యాంగ్‌) మూలంగా ఇది పుట్టుకొచ్చింది. ఇంతకీ విశ్వమంటే? అంతరిక్షంలోని మొత్తం పదార్థం, శక్తితో పాటు ఉనికిలో ఉన్న సమస్తాన్నీ విశ్వమని అభివర్ణించుకుంటున్నాం. అయితే మనం భూమి మీది నుంచి మొత్తం విశ్వాన్ని చూడలేం. కాబట్టే చూడగలిగినంత మేరను దృగ్గోచర విశ్వమని, మిగిలిన దాన్ని అదృశ్య విశ్వమని విభజించారు. కనిపించే విశ్వం అంచులను కాస్మిక్‌ హొరైజన్‌ అని పిలుచుకుంటున్నాం.

కొంతే ఎందుకు?

విశ్వం మొత్తం ఎందుకు కనిపించదు? కొంతవరకే ఎందుకు కనిపిస్తుంది? దీనికి కారణం మొదటి నుంచీ విస్తరిస్తూ వస్తుండటమే (కాస్మిక్‌ ఇన్‌ఫ్లేషన్‌). బిగ్‌ బ్యాంగ్‌ సంభవించినప్పటి నుంచీ అంతరిక్షం అన్ని దిశలకూ విస్తరిస్తూనే వస్తోంది. అదీ కాంతి కన్నా ఎక్కువ వేగంతో. అందువల్ల ఆరంభంలో విశ్వం అంచులకు ఉన్నవి చాలావరకు అదృశ్య విశ్వంలోకి వెళ్లిపోయాయని చెప్పుకోవచ్చు. అంతరిక్షం కాంతి కన్నా ఎక్కువ వేగంతో విస్తరిస్తూ ఉండటం వల్ల అదృశ్య విశ్వంలోని వస్తువుల నుంచి వెలువడే వెలుగు మనకు ఎప్పటికీ చేరుకోలేదు. దృగ్గోచర విశ్వం అంచు ‘కాస్మిక్‌ హొరైజన్‌’ ఏటా సుమారు 6.5 కాంతి సంవత్సరాల మేరకు విస్తరిస్తోంది!

ఆవల ఏముంది?

కాస్మిక్‌ హొరైజన్‌ ఆవల ఏముందనే దానిపై భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. కనిపించే విశ్వంలో మాదిరిగానే అక్కడా బోలెడన్ని నక్షత్ర మండలాలు, సముదాయాలు ఉండొచ్చన్నది కొందరు పరిశోధకుల భావన. దృగ్గోచర విశ్వం గుండ్రంగా, బంతిలా ఉంటుందని మనం అనుకుంటుంటాం. అయితే ఈ విశాల దృగ్గోచర విశ్వంలోనూ మనకు కనిపించేది కొంతే. దీని ఆకారం మనకు స్పష్టంగా తెలియదు. సమతలంగానూ ఉండొచ్చనీ భావిస్తుంటారు. అంతరిక్షంలోని స్థలంలో వంపు ఏర్పడుతుందని ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం చెబుతుంది. కాబట్టి విశ్వం సమతలంగా, గుండ్రంగా, కొడవలి ఆకారంలో ఎలాగైనా ఉండే అవకాశముంది. దీని ఆకారం అపరిమిత లేదా పరిమిత పొడవు మీద ఆధారపడి ఉంటుంది. వంపులు తమకు తామే సరిదిద్దుకొని గుండ్రంగానూ ఏర్పడొచ్చు.

ఆవల సమతలంగా ఉందా?

బిగ్‌ బ్యాంగ్‌ సంభవించాక తొలిదశలో విస్తరణ తర్వాత.. సుమారు 4 లక్షల సంవత్సరాల అనంతరం రేడియేషన్‌ వెలుగు మిగిలిపోయింది. దీన్నే కాస్మిక్‌ మైక్రోవేవ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ (సీఎంబీ) అంటున్నారు. దీని సాయంతోనే ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం పరిమాణం, ఆకారాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఈ సీఎంబీ మన కళ్లకు కనిపించదు. విద్యుదయస్కాంత చట్రంలోని మైక్రోవేవ్‌ భాగాన్ని పరిశీలిస్తేనే బయటపడుతుంది. ఇది విస్తరిస్తున్నప్పుడు తలెత్తిన ఉష్ణోగ్రత వ్యత్యాసాల ద్వారా విశ్వం తీరుతెన్నులను శాస్త్రవేత్తలు గణించారు. దీని ప్రకారం మనకు కనిపించే విశ్వం అంచుల ఆవలి భాగం సమతలంగా ఉందని అర్థమవుతుంది. కానీ దీనిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలున్నాయి.

అంచులకు చేరుకోవచ్చా?

దృగ్గోచర విశ్వం అంచులకు చేరుకోగలమా? దాన్ని దాటుకొని వెళ్లగలమా? అంతవరకు చేరుకోవాలంటే ముందుగా కొన్ని భౌతికశాస్త్ర నియమాలను అధిగమించే మార్గాలను కనుగొనాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది విస్తరిస్తున్న విశ్వం వేగాన్ని ఎదుర్కోవటం. కాంతి కన్నా ఎక్కువ వేగంతో విశ్వం విస్తరిస్తుండటం వల్ల అంతకన్నా ఎక్కువ వేగంతో దూసుకెళ్లే రాకెట్‌ను సృష్టించగలగాలి. అప్పుడే కాస్మిక్‌ హొరైజన్‌ను చేరుకొని, దాన్ని దాటుకొని వెళ్లగలం. ఇది అసాధ్యం. ఇప్పటివరకూ కాంతి వేగాన్ని మించే రాకెట్‌ ఏదీ ఉనికిలో లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. అంతరిక్షంలో అత్యంత దూరం వెళ్లగల రాకెట్‌ అయినా భూమి నుంచి 1,800 కోట్ల కాంతి సంవత్సరాల లోపు వరకే చేరుకోగలదు!

కాస్మిక్‌ మైక్రోవేవ్‌ బ్యాక్‌గ్రౌండ్‌


మనకు తెలిసిన మొత్తం దృగ్గోచర విశ్వం

1 కాస్మిక్‌ హొరైజన్‌

తీరం నుంచి చూస్తున్నప్పుడు ఒకచోట సముద్రం, ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుంది కదా. అలాగే మనకు కనిపించే సుదూర నక్షత్ర మండలాల ప్రాంతాన్ని కాస్మిక్‌ హొరైజన్‌ అంటాం.

2 అతి విశాలం

ఒకవేళ దృగ్గోచర విశ్వం గుండ్రంగా ఉందనుకున్నట్టయితే దీని వ్యాసం సుమారు 9,300 కోట్ల కాంతి సంవత్సరాలు.

3 సుదూర నక్షత్ర మండలం

మనకు తెలిసిన అత్యంత సుదూర నక్షత్ర మండలం 1350 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనిపేరు హెచ్‌డీ1. ఇందులో కొన్ని పురాతన నక్షత్రాలు ఉండొచ్చని అనుకుంటున్నారు.

4 గోరంతే

విశ్వంలో సుమారు నాలుగు శాతమే మనకు కనిపించే అవకాశముందని అంచనా. మిగతా మొత్తమంతా రహస్యమే.

5 పదార్థ మిశ్రమం

తెలిసిన విశ్వం 4.9% అణువులు లేదా పదార్థం, 26.8% కృష్ణ పదార్థం, 68.3% కృష్ణ శక్తితో ఏర్పడింది.

6 నక్షత్ర మండలాలు

దృగ్గోచర విశ్వంలో సుమారు 2 ట్రిలియన్ల నక్షత్ర మండలాలు ఉన్నాయని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని