ఖిల్‌జా డాక్‌ డాక్‌

గూగుల్‌ డాక్స్‌. ఆఫీసు వ్యవహారాలకో, వ్యక్తిగత అవసరాలకో డాక్యుమెంట్ల కోసం ఎంతోమంది దీన్ని వాడుతూనే ఉంటారు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఎన్నో. తరచూ వాడేవారిలోనూ చాలామందికి వీటి గురించి తెలియదన్నా అతిశయోక్తి కాదు.

Updated : 18 Oct 2023 07:10 IST

గూగుల్‌ డాక్స్‌. ఆఫీసు వ్యవహారాలకో, వ్యక్తిగత అవసరాలకో డాక్యుమెంట్ల కోసం ఎంతోమంది దీన్ని వాడుతూనే ఉంటారు. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఎన్నో. తరచూ వాడేవారిలోనూ చాలామందికి వీటి గురించి తెలియదన్నా అతిశయోక్తి కాదు. ఒకసారి తెలిస్తే ఔరా అనాల్సిందే. ఇన్నాళ్లూ ఎక్కడ దాగున్నాయోననీ అబ్బురపడాల్సిందే. చిటికెలో డాక్యుమెంటును సృష్టించటం దగ్గరి నుంచి పక్కలకు చూపు మళ్లకుండా ఏకాగ్రతతో రాసుకోవటం వరకూ తోడ్పడే చిట్కాల గురించి తెలుసుకుందాం.  అప్పుడు జాయ్‌ జాయ్‌ మంటూ త్వరగా పనులు కానిచ్చేయొచ్చు.

వెంటనే కొత్త డాక్యుమెంట్‌

కొత్త డాక్యుమెంటును సృష్టించటానికి ప్రతిసారీ గూగుల్‌ డ్రైవ్‌లోకో, డాక్స్‌లోకో వెళ్లాల్సిన పనిలేదు. నేరుగా బ్రౌజర్‌ నుంచే సృష్టించుకోవచ్చు. అడ్రస్‌ బార్‌లో doc.new అని టైప్‌ చేసి, ఎంటర్‌ నొక్కితే చాలు. కొత్త డాక్యుమెంటు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. వెంటనే టైప్‌ చేసుకోవచ్చు. అయితే ముందే గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ అయ్యిండాలని మరవొద్దు. తర్వాత అయినా లాగిన్‌ కావొచ్చనుకోండి.

టూల్‌ తేలికగా

డాక్స్‌లో ఏ టూల్‌ ఎక్కడుందో కనిపెట్టటం కాస్త కష్టమైన పనే. ఇక్కడే టూల్‌ ఫైండర్‌ బాగా పనికొస్తుంది. ఒక్కో మెనూను చూడాల్సిన అవసరం లేకుండా మెనూ బార్‌లో అవసరమైన టూల్‌ను వెంటనే వెతికి పట్టుకోవచ్చు. డాక్యుమెంట్‌ పైన హెల్ప్‌ మీద క్లిక్‌ చేస్తే టూల్‌ ఫైండర్‌ కనిపిస్తుంది. ఇందులో సెర్చ్‌ ద మెనూస్‌ను ఎంచుకోవాలి. చిటికెలో టూల్‌ ఫైండర్‌ను చేరుకోవాలంటే ఆల్ట్‌, స్లాష్‌ గుర్తులను కలిపి నొక్కినా చాలు. తెర పైన ఎడమ వైపు టూల్‌ ఫైండర్‌ ప్రత్యక్షమవుతుంది. అవసరమైన టూల్‌ పేరును టైప్‌ చేస్తే అది డ్రాప్‌ డౌన్‌ మెనూలో కనిపిస్తుంది.

పేజీల విభజన లేకుండా

డాక్స్‌ పేజీ డిఫాల్ట్‌గా ప్రింటులో మాదిరిగా కనిపిస్తుంది. అయితే నేటి డిజిటల్‌ కాలంలో హార్డ్‌ కాపీ ఎవరికి కావాలి చెప్పండి? పేజ్‌లెస్‌ ఫార్మాట్‌కి మారితే సరి. దీంతో పేజీల వారీగా విడిపోకుండా డాక్యుమెంట్‌ అంతా ఒకేలా కనిపిస్తుంది. ఇమేజ్‌లూ పెద్దగా అవుతాయి. హెడ్డింగ్స్‌ కుంచించుకు పోతాయి. ఈ పేజ్‌లెస్‌ ఫార్మాట్‌ను సెట్‌ చేసుకోవాలంటే- ఫైల్‌ మెనూలోకి వెళ్లి పేజ్‌ సెటప్‌ను ఎంచుకోవాలి. ఇందులో పేజ్‌లెస్‌ ట్యాబ్‌కు మారి, ఓకే మీద క్లిక్‌ చేయాలి. ఇది ఆ డాక్యుమెంట్‌కే వర్తిస్తుంది. అన్నింటికీ అమలు కావాలంటే ‘సెట్‌ యాజ్‌ డిఫాల్ట్‌’ను ఎంచుకోవాలి. ఒకసారి పేజ్‌లెస్‌ ఫార్మాట్‌ను ఎంచుకుంటే హెడ్డింగ్స్‌ మీద కర్సర్‌ పెడితే వి గుర్తు కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేసి హెడ్డింగ్‌ను విస్తరించొచ్చు, కుదించొచ్చు.

తక్షణం నిఘంటువు

తెలియని పదమేదో కనిపించింది. అర్థమేంటో తెలుసుకోవటానికి నిఘంటువును చూడాల్సిన పనిలేదు. బ్రౌజర్‌ ద్వారా ఇంటర్నెట్‌ను శోధించాల్సిన అవసరమూ లేదు. గూగుల్‌ డాక్స్‌లో బిల్టిన్‌గా ఉండే డిక్షనరీ సాయం తీసుకోవచ్చు. అర్థాలు, నానార్థాలు ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ డిక్షనరీ ఫీచర్‌ను వాడుకోవాలంటే- డాక్యుమెంటులో పదాన్ని హైలైట్‌ చేసి, టూల్స్‌ మెనూ మీద నొక్కాలి. డ్రాప్‌డౌన్‌ జాబితాలో డిక్షనరీ ఫీచర్‌ను ఎంచుకోవాలి. కంట్రోల్‌, షిఫ్ట్‌, వై మీటలను కలిపి నొక్కినా నేరుగా డిక్షనరీ ఫీచర్‌ కనిపిస్తుంది. కుడివైపున కనిపించే డిక్షనరీ బాక్స్‌లో ఆ పదానికి సంబంధించిన ఉచ్చారణ, నిర్వచనం, అర్థాలు, నానార్థాలన్నీ ప్రత్యక్షమవుతాయి.

ఏకాగ్రతతో పని

డాక్స్‌లో చేస్తున్న పని మీదే దృష్టి పెట్టాలని భావిస్తున్నారా? మనసు వేరే విషయాల మీదికి మళ్లొద్దని అనుకుంటున్నారా? అయితే బ్రౌజర్‌లో, డాక్స్‌లో ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌ను కంబైన్‌ చేస్తే చాలు. మెనూలో వ్యూ మీద క్లిక్‌ చేసి ఫుల్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. దీంతో డాక్స్‌లో ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌ ఎనేబుల్‌ అవుతుంది. తర్వాత తెర పైభాగాన కుడివైపు కనిపించే నిలువు మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు బ్రౌజర్‌ సెటింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఇందులో జూమ్‌ ద్వారా ఫుల్‌స్క్రీన్‌ గుర్తు మీద నొక్కాలి. షార్ట్‌కట్‌గా ఎఫ్‌11 మీటను లేదా ఫైండ్‌, ఎఫ్‌11 మీటలను కలిపి నొక్కినా సరే. దీంతో బ్రౌజర్‌ ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌లోకి మారుతుంది. ఇలా డాక్స్‌, బ్రౌజర్‌ రెండింటిలోనూ ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌ ఎనేబుల్‌ అయితే బ్రౌజర్‌లో ఇతర దృశ్యాల మీదికి మనసు మళ్లదు. కంప్యూటర్‌లో నోటిఫికేషన్లను టర్న్‌ ఆఫ్‌ చేసుకుంటే టైప్‌రైటర్‌ మీద టైప్‌ చేస్తున్న భావనే కలుగుతుంది. పని వేగం పెరుగుతుంది.

పదబంధానికి మారుపేరు

డాక్యుమెంట్‌లో పెద్ద వ్యాసాల వంటివి రాసేటప్పుడు కొన్ని పదబంధాలను మళ్లీ మళ్లీ రాయాల్సి రావొచ్చు. కొన్నిసార్లు ఒకే అంశాన్ని చాలాసార్లు ప్రస్తావి స్తుండొచ్చు. ప్రతీసారీ వాటిని టైప్‌ చేయకుండా డాక్స్‌లో మంచి సదుపాయం ఉంది. అదే ఆటోమేటిక్‌ సబ్‌స్టిట్యూషన్‌. అబ్రివేషన్ల ద్వారా మొత్తం పదబంధాన్ని, అంశాన్ని వెంటనే టైప్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే- టూల్స్‌ మెనూ ద్వారా ఫ్రిఫరెన్స్‌లోకి వెళ్లాలి. ఇందులో సబ్‌స్టిట్యూషన్స్‌ ట్యాబ్‌లోకి వెళ్తే రిప్లేస్‌, విత్‌ బాక్స్‌లు కనిపిస్తాయి. రిప్లేస్‌లో అబ్రివేషన్‌ను టైప్‌ చేయాలి. విత్‌ బాక్స్‌లో అంశాన్ని, పదబంధాన్ని రాయాలి. అనంతరం ఓకే మీద నొక్కాలి. డాక్యుమెంట్‌లోకి వచ్చాక అబ్రివేషన్‌ను టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కగానే అంశం లేదా పదబంధం దానంతటదే టైప్‌ అవుతుంది. ఉదాహరణకు- ‘హైదరాబాద్‌లోని చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌ వంటి సందర్శన ప్రాంతాలు’ అనే వాక్యాన్ని మాటిమాటికి రాయాల్సి వస్తే దీన్ని విత్‌ బాక్స్‌లో టైప్‌ చేయాలి. రిప్లేస్‌ బాక్స్‌లో దీనికి ఎక్స్‌వైజెడ్‌ను అబ్రివేషన్‌గా పెట్టుకున్నారనుకుందాం. డాక్యుమెంట్‌లో ఎక్స్‌వైజెడ్‌ అని టైప్‌ చేసి, ఎంటర్‌ చేస్తే నిర్ణయించుకున్న వాక్యం మొత్తం టైప్‌ అవుతుంది. సబ్‌స్టిట్యూషన్స్‌ విభాగంలో ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ వంటి సంకేతాలకూ అబ్రివేషన్లు ఉంటాయి.

అనువాదం ఇట్టే

ఎవరైనా తెలియని భాషలో డాక్యుమెంట్‌ పంపించారా? అదేంటో తెలుసుకోవటానికి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. డాక్స్‌లో బిల్టిన్‌గా ఉండే ట్రాన్స్‌లేటర్‌ ఫీచర్‌ను ఎంచుకుంటే సరి. మెనూబార్‌లో టూల్స్‌ మీద క్లిక్‌ చేస్తే డ్రాప్‌డౌన్‌ జాబితాలో ట్రాన్స్‌లేట్‌ డాక్యుమెంట్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. దీని మీద క్లిక్‌ చేసి భాషను ఎంచుకొని ట్రాన్స్‌లేట్‌ మీద నొక్కితే చాలు. కొత్త ట్యాబ్‌లో అనువాదమైన డాక్యుమెంట్‌ ప్రత్యక్షమవుతుంది.

మరింత వివరణగా..

ఏదైనా అంశాన్ని మరింతగా వివరించాలని అనుకుంటున్నారా? గతంలో రాసిన దానికి రిఫరెన్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నారా? డాక్యుమెంట్‌ను ఆకర్షణీయంగా మలచటానికి ఇమేజ్‌ను జత చేయాలని భావిస్తున్నారా? డాక్యుమెంట్‌లోని ఎక్స్‌ప్లోర్‌ టూల్‌ సాయం తీసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్‌లో, గూగుల్‌ డ్రైవ్‌లో సెర్చ్‌ చేయటానికి వీలు కల్పిస్తుంది. అదీ డాక్యుమెంట్‌లోంచే. టూల్స్‌ మెనూ మీద క్లిక్‌ చేసి ఎక్స్‌ప్లోర్‌ ఫీచర్‌ను చేరుకోవచ్చు. దీనికో షార్ట్‌కట్‌ కూడా ఉంది. కంట్రోల్‌, ఆల్ట్‌, షిఫ్ట్‌, ఐ మీటలను కలిపి నొక్కితే నేరుగా ఎక్స్‌ప్లోర్‌ ఓపెన్‌ అవుతుంది. డాక్యుమెంట్‌ కుడివైపున కనిపించే ఇందులో అవసరమైన అంశాన్ని, విషయాలను సెర్చ్‌ చేయొచ్చు.

కీబోర్డు మీటలతోనే టెక్స్ట్‌ ఫార్మాట్‌

హెడ్డింగ్‌ పెట్టటానికో, ముఖ్యమైన విషయాన్ని బోల్డ్‌ చేయటానికో మౌజ్‌ను వాడటం మామూలే. అయితే మాటిమాటికీ మౌజ్‌ను పట్టుకోవటం చిరాకు తెప్పించొచ్చు. ఇలాంటివారికి మార్క్‌డౌన్‌ టూల్‌ మంచి పరిష్కారం చూపుతుంది. కీబోర్డు మీటలతోనే టెక్స్ట్‌ను ఫార్మాట్‌ చేసుకోవచ్చు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. ఒకసారి వాడటం అలవాటైతే టెక్స్ట్‌ ఫార్మాట్‌ వ్యవహారాలన్నీ మార్క్‌డౌన్‌తోనే చేసేస్తామంటారు. మరి దీన్ని ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలి? ముందుగా టూల్స్‌ మెనూ ద్వారా ప్రిఫరెన్స్‌లోకి వెళ్లాలి. ఇందులో జనరల్‌ విభాగం కింద ఆటోమేటికల్లీ డిటెక్ట్‌ మార్క్‌డౌన్‌ బాక్స్‌ను టిక్‌ చేసి, ఓకే మీద నొక్కాలి.

నేరుగా ఫొటో ఇన్‌సర్ట్‌

గూగుల్‌ డాక్స్‌లో ఫొటోను ఇన్‌సర్ట్‌ చేయాలని అనుకున్నారు. అదేమో ఫోన్‌లో ఉంది. మరెలా? గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని, దాన్ని సింక్‌ చేసుకొని ఉంటే నేరుగా ఫోన్‌లోంచే ఇన్‌సర్ట్‌ చేసేయొచ్చు. ఇందుకోసం మెనూలో ఇన్‌సర్ట్‌ ద్వారా ఇమేజ్‌లోకి వెళ్లాలి. దీని మీద క్లిక్‌ చేస్తే ఫొటోస్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిలోంచి ఫొటోను ఎంచుకొని, ఇన్‌సర్ట్‌ చేయటమే తరువాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని