Android malware: మరో మాల్‌వేర్‌ కలకలం.. కేటుగాళ్ల కనుసన్నుల్లోనే అంతా..!

ఆండ్రాయిడ్‌ మొబైల్లో కొత్తగా మరో మాల్‌వేర్‌ కలకలం రేపుతోంది. గతేడాది గుర్తించిన బ్యాంకింగ్‌ ట్రోజన్ మాల్‌వేర్‌కు ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్‌.

Updated : 02 Jun 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో కొత్తగా మరో మాల్‌వేర్‌ కలకలం రేపుతోంది. గతేడాది గుర్తించిన బ్యాంకింగ్‌ ట్రోజన్ మాల్‌వేర్‌కు ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్‌. ప్రస్తుతం ఇది యాక్టివ్‌గా ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. తాజా మాల్‌వేర్‌ను ERMAC 2.0గా పేర్కొన్నారు. మోసపూరిత యాప్‌ల ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లతో పాటు సున్నితమైన డేటాను ఈ మాల్‌వేర్‌ దొంగిలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకింగ్‌ ఖాతాలను కేటుగాళ్లు లూటీ చేస్తున్నట్లు వివరించారు. 

ఎలా ప్రవేశిస్తుందంటే..?

2021లో గుర్తించిన ERMAC 1.0 మాల్‌వేర్‌ 378 అప్లికేషన్ల ద్వారా క్రెడెన్షియల్ డేటాను దొంగిలించినట్లు సమాచారం. అయితే, తాజా వెర్షన్‌ దాదాపు 467 అప్లికేషన్లతో డేటా దోపిడీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైబర్‌ నిపుణులు గుర్తించారు. పైగా డార్క్‌నెట్‌ సైట్‌లలో ఈ మాల్‌వేర్‌ను కేటుగాళ్లు అమ్మకానికి కూడా పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ ద్వారా ఈ సమచారాన్ని రాబట్టినట్లు సైబుల్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ నివేదిక స్పష్టం చేసింది. 

మోసపూరిత యాప్‌ల ద్వారా ఈ మాల్‌వేర్‌ను మొబైల్లోకి జొప్పించే అవకాశం ఉంది. కొత్తగా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయగానే.. 43 రకాల అనుమతులను ఇది కోరుతుంది. ఏదీ చదవకుండా వాటిని ఓకే చేస్తే మొబైల్‌ నియంత్రణ పూర్తిగా మోసగాళ్ల చేతికి వెళ్తుందని సైబర్‌ నిపుణులు పేర్కొన్నారు. ఆపై యూజర్లు ఏ పోర్టల్‌, యాప్‌ లాగిన్‌ చేసినా దాని పూర్తి కంట్రోల్‌ కేటుగాళ్ల కనుసన్నుల్లోనే జరుగుతుంది. తద్వారా సున్నితమైన డేటాతో పాటు బ్యాంకింగ్‌ ఖాతా వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలివిగో.. 

* గూగుల్‌, ఐవోఎస్‌ అధికారిక స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

పాస్‌వర్డ్ భద్రతలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడొద్దు. బలమైన పాస్‌వర్డ్‌లను సెట్‌ చేసుకోవాలి.

ఫింగర్‌ ప్రిట్‌ స్కానర్‌ వంటి ఫీచర్లు మీ మొబైల్‌లో ఉంటే వాటినే ఉపయోగించే ప్రయత్నం చేయండి.

ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్‌ల ద్వారా వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దు. 
యాప్‌లకు అనుమతులు ఇచ్చే ముందే వాటిని పూర్తిగా చదవండి.
ఎప్పటికప్పుడు యాప్‌లు, మీ మొబైల్‌కు వచ్చే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా చేసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని