సూపర్‌ ఫీచర్స్‌తో MIUI 12.5 వెర్షన్‌

షావోమి తన ఫోన్ల కోసం కొత్త అప్‌డేషన్‌ను తీసుకురాబోతుంది.  Mi11 స్మార్ట్‌ఫోన్‌తోపాటు కొత్తగా...

Updated : 15 Aug 2022 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమీ తన ఫోన్ల కోసం కొత్త అప్‌డేషన్‌ను తీసుకురాబోతుంది. Mi11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్తగా MIUI 12.5 బీటా వెర్షన్‌ను చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు షావోమీ ప్రకటించింది. ఎంఐయూఐ 12 వెర్షన్‌ ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు మరికొన్ని అదనపు ఫీచర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. అప్‌డేటె‌డ్‌ ఎంఐయూఐ 12.5 వెర్షన్‌తో వచ్చే మంచి ఫీచర్లను తెలుసుకుందాం.. 

ప్రైవసీకి రక్షణగా.. 

స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒకరి సమాచారం ఇంకొకరు తస్కరించకుండా, అనుమతి లేకుండా చూసేందుకు వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. దానికోసం ఇప్పటికే ఉన్న ప్రైవసీ సెట్టింగ్స్‌ను షావోమీ తన కొత్త వెర్షన్‌లో అప్‌డేట్‌ చేసింది. యాపిల్‌ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్ ఐవోఎస్‌ 14 మాదిరిగానే ఎంఐయూఐ 12.5 వెర్షన్‌లో బ్రౌజింగ్‌ ప్రొటెక్షన్, క్లిప్‌బోర్డ్‌ యాక్సెస్, ఫైల్ సాండ్‌బాక్స్ మెకానిజం వంటి ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ అయింది. 


సూపర్ వాల్‌పేపర్స్‌

స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి చాలా మంది వాల్‌పేపర్స్‌ను పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలకు సంబంధించిన వాల్‌పేపర్స్‌ను కొత్త వెర్షన్‌లో యాడ్‌ చేసింది. మౌంట్‌ ఎవరెస్ట్, మౌంట్‌ ఫుజి వంటి ఎత్తయి పర్వత శ్రేణుల సూపర్ వాల్‌పేపర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ ఇంకో తమాషా విషయం ఏమిటంటే.. మౌంట్‌ ఎవరెస్ట్‌ వాల్‌పేపర్‌ను  పెట్టుకుంటే ఉదయం 8 గంటలకు ఓ రకంగానూ.. రాత్రి 8 గంటలకు మరో విధంగానూ కనిపించడం విశేషం.


ఎంఐయూఐ+ బీటా వెర్షన్‌..

షావోమీ యూజర్లు తమ డివైస్‌లతోపాటు వ్యక్తిగత కంప్యూటర్లకు అనుసంధానమై ఒకే సమయంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఎంఐయూఐ+ ఫీచర్‌ను అప్‌డేటెడ్‌ ఎంఐయూఐ 12.5 వెర్షన్‌లో తీసుకురాబోతుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో ఈ ఆప్షన్‌ను షావోమీ తీసుకొచ్చింది. ఎంఐయూఐ+ ఫీచర్‌ ద్వారా మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను కంప్యూటర్‌లోనూ చూడొచ్చు. టెక్ట్స్‌ను మొబైల్‌లో కాపీ చేసి డైరెక్ట్‌గా కంప్యూటర్ మీద పేస్ట్‌ చేసుకునే వీలు కలుగుతుంది. ఫోన్‌లోని ఫైల్స్‌ను పీసీలో ఎడిట్‌ చేసుకుని మొబైల్‌లోనే సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ రానుంది. మొబైల్‌, పీసీల మధ్య సాంకేతిక వారధిగా ఎంఐయూఐ+ పనిచేయనుంది.


మరికొన్ని అద్భుత ఫీచర్లు
 

షావోమీ తన యూజర్లకు ఎప్పటికప్పుడు మంచి ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. ఎంఐయూఐ 12 వెర్షన్‌తో పోలిస్తే ఎంఐయూఐ 12.5 వెర్షన్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించి అదనపు ఫీచర్లను జత చేసింది. మెమొరీ వాడకం దాదాపు 25 శాతం, బ్యాక్‌గ్రౌండ్‌ మెమొరీ యూసేజ్‌ను 35 శాతం, పవర్‌ వినియోగంను 25 శాతం వరకు తగ్గించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసింది. ఐవోఎస్ 14తో పోలిస్తే యానిమేషన్స్‌ను మరింత అప్‌డేట్‌ చేసినట్లు షావోమీ వెల్లడించింది. 


ఇతర ఓఎస్‌ల కంటే తక్కువ బ్లోట్‌వేర్

ఎంఐయూఐ 1.25 వెర్షన్‌ వేగవంతం, శుభ్రంగా, భద్రంగా ఉండటమే కాకుండా ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)ల కంటే తక్కువ బ్లోట్‌వేర్ కలిగి ఉండటం విశేషం. యాపిల్‌ ఐవోఎస్ 14 కంటే తమ ఎంఐయూఐ 12.5 వెర్షన్‌లో తక్కువ బ్లోట్‌వేర్‌ ఉంటుందని షావోమీ ప్రకటించింది. ఎంఐయూఐ 12.5 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌లో కేవలం తొమ్మిది యాప్స్‌ మాత్రమే ఉంటాయని పేర్కొంది. ఈ తొమ్మిది యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడానికి కుదరదు. డయలర్, మెసేజ్, కెమెరా, బ్రౌజర్, గ్యాలరీ, సెక్యూరిటీ, క్లాక్, సెట్టింగ్స్, ఎంఐ స్టోర్‌ యాప్‌ మాత్రమే ఉంటాయి. 


అందుబాటులోకి ఎప్పుడంటే..?

ప్రస్తుతం చైనాలోనే ఎంఐయూఐ 12.5 వెర్షన్‌ బీటా రిజిస్ట్రేషన్లను ఇరవైకిపైగా స్మార్ట్‌ఫోన్ల మోడళ్లకు అనుమతినిచ్చింది. ఎంఐ 10 సిరీస్‌, రెడ్‌మీ కే30, ఇతర రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయంగా త్వరలోనే ఎంఐయూఐ 12.5 అప్‌డేటెడ్‌ వెర్షన్ తీసుకొస్తామని షావోమీ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని