CES 2022: ప్రపంచ టెక్‌ సదస్సు‌లో.. అలరించేవి ఇవేనా..?

ప్రపంచ అతిపెద్ద టెక్‌ సదస్సు‌-2022కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఈఎస్‌-2022లో.. 

Updated : 10 Aug 2022 12:02 IST

ఎప్పటిలాగే ప్రపంచ అతిపెద్ద టెక్‌ సదస్సు‌-2022 (Consumer Electronics Show, CES-2022)కు సర్వం సిద్ధమైంది. టెక్నాలజీ ప్రపంచం దూసుకెళ్తోన్న వేళ.. భవిష్యత్తులో రాబోయే మరిన్ని గ్యాడ్జెట్‌లు, ఆవిష్కరణ ఆలోచనల పరిచయానికి ఈ సదస్సు వేదిక కానుంది. అమెరికా నెవడాలోని వెంచెస్టర్‌ లాస్‌ వెగాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జనవరి 5 నుంచి 8 వరకు.. ఈ ‘వరల్డ్‌ బిగెస్ట్‌ టెక్నాలజీ ట్రెండ్‌ షో’ జరగనుంది. దీనిలో భాగంగా పలు దిగ్గజ కంపెనీలు వాటి తాజా ఉత్పత్తులు, త్వరలో తీసుకురాబోయే గ్యాడ్జెట్‌ల ప్రొటొటైప్‌లు పంచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో సీఈఎస్‌-2022 వేడుకలో కంపెనీల నుంచి ఏం ఆశించవచ్చో చూద్దాం..!

సరికొత్త గ్రాఫిక్స్‌ టెక్నాలజీ

కంప్యూటర్‌ యుగంలో సరికొత్త గ్రాఫిక్స్‌ కార్డులకు సంబంధించి ఇంటెల్‌ (Intel) కంపెనీ ‘ఆర్క్‌ ఆల్కెమిస్ట్‌ (Arc Alchemist)’ గ్రాఫిక్స్‌ కార్డుపై సీఈఎస్‌-2022లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ‌అలాగే NVIDIA ‘RTX 3090 Ti’ గ్రాఫిక్స్‌ను పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు భవిష్యత్తు సాంకేతికను దృష్టిలో పెట్టుకొని మీడియాటెక్‌ (MediaTek) Wi-Fi 7 సాంకేతికను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లు

సీఈఎస్‌-2022లో ఈసారి కూడా ఏసర్ (‌Acer), డెల్‌ (Dell), రేజర్‌ (Razer) కంపెనీల నుంచి మరిన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు పరిచయం కావచ్చు. మినీ ఎల్‌ఈడీ డిస్ప్లేలు, డీడీఆర్‌5 (DDR5) ర్యామ్‌ వంటి అధునాతన టెక్నాలజీలు ఈ కొత్త ల్యాప్‌టాప్‌లలో భాగమే. మరోవైపు స్మార్ట్‌ మొబైల్స్‌లో శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Galaxy S21 FE)తో పాటు ఏ సిరీస్‌ కొత్త మోడల్‌లు, ఆసుస్‌ నుంచి ఆర్‌ఓజీ గేమింగ్‌ టాబ్లెట్‌ను ఆ కంపెనీ ప్రతినిధులు ఈ వేడుకలో లాంచ్‌ చేయవచ్చు. వీటితో పాటే పలు మొబైల్‌ కంపెనీలు వాటి ఉత్పత్తులను పరిచయం చేసే అవకాశం ఉంది.

టీవీలు, గృహోపకరణాలు

టీవీల్లో OLED ప్యానెల్‌ టెక్నాలజీకి సంబంధించి దిగ్గజ కంపెనీ ఎల్‌జీ (LG) నెక్స్ట్‌ జనరేషన్‌ ‘OLED EX’ను ప్రదర్శించనుంది. ప్రస్తుతం OLED ప్యానెల్‌ టీవీల్లో కంటే ఇది 30 శాతం అధిక బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుందని ఎల్‌జీ ఇప్పటికే ప్రకటించింది. వీటితో పాటే ఎల్‌జీ నుంచి కొత్తతరం స్క్రీన్‌లు, టీసీఎల్‌ (TCL) నుంచి 6 సిరీస్‌ మినీ ఎల్‌ఈడీ టీవీలు ఆశించవచ్చు. మరోవైపు హై-ఎండ్‌ OLED టీవీలకు దీటుగా శాంసంగ్‌ (Samsung) కొత్త డిస్ప్లే టెక్నాలజీ ‘క్వాంటం డాట్‌ OLED (QD-OLED)’ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇవేకాకుండా సోనీ (Sony) తన కొత్త టీవీని ఈ వేడుకల్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. మరోవైపు గృహోపకరణాలకు సంబంధించి సీఈఎస్‌-2022లో అత్యాధునిక వాక్యూమ్‌ క్లీనర్‌లు, కమర్షియల్‌ రోబోట్‌లను పలు కంపెనీలు పరిచయం చేయనున్నాయి. 

పక్కాగా ఏర్పాట్లు..

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని సీఈఎస్‌-2022 ఈవెంట్‌ను వాయిదా వేయాలని కొన్ని వారాల కింద అమెజాన్‌, గూగుల్‌, ఇంటర్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు కోరాయి. అయితే వాయిదా, వర్చువల్‌ సదస్సుకు బదులుగా సీఈఎస్‌-2022ను కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ పక్కాగా ప్లాన్‌ చేసింది. ఎంపిక చేసిన పరిమిత కంపెనీ ప్రతినిధులను మాత్రమే ఈవెంట్‌కు ఆహ్వానించింది. కంపెనీల ప్రతినిధుల ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకాకుంటే ఆన్‌లైన్‌ ద్వారా వారి గ్యాడ్జెట్‌లను పరిచయం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే సదస్సులోని పలు ముఖ్యమైన కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించేందుకు సీఈఎస్-2022 వెబ్‌సైట్‌ను చూడవచ్చని గ్యాడ్జెట్‌ ప్రియులకు సూచించింది.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని