logo

‘అధైర్యపడొద్దు..’ అండగా ఉంటాం

దాడులకు భాజపా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని

Updated : 28 Jan 2022 05:29 IST

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌, వేదికపై ఎంపీ అర్వింద్‌, దుబ్బాక ఎమ్మెల్యే

రఘునందన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌, నందిపేట్‌, న్యూస్‌టుడే: దాడులకు భాజపా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మూడ్రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడిన నందిపేట్‌ మండలానికి చెందిన బాధితులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన, ఎంపీ అర్వింద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర పార్టీ నాయకులతో కలిసి నందిపేట్‌లో పర్యటించారు. సాయంత్రం 4.20కి గోజూర్‌ నరేందర్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడే ఉన్న శాపూర్‌కు చెందిన కార్యకర్త మహేశ్‌తో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. తెరాస కార్యకర్తలు తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితులు చెప్పారు. 4.45కు అరుట్ల రమేశ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మహిళలు సమయానికి కేకలు వేయటంతో తన భర్తకు ప్రాణాపాయం తప్పిందని రమేశ్‌ సతీమణి భావోద్వేగానికి గురయ్యారు. 6.26కు బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ వడ్ల భోజన్న ఇంటికి వెళ్లి, అనంతరం నికాల్‌పూర్‌కు చెందిన జిలకర చిన్నయ్య, కొండ గంగాప్రసాద్‌ను పరామర్శించారు. భాజపా కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని వారు వివరించారు. రాత్రి 7:30కి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయ్‌ని నిజామాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్‌ వచ్చిన నేతలు.. భోజనం చేశాక 3 గంటలకు నందిపేట్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణించే మార్గంలో ఇస్సాపల్లి, ఆలూరు వద్ద యువకులు తమ అభిమాన నేతలను కలిసేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మండలాధ్యక్షుడు రాజు, శ్రీనివాస్‌రెడ్డి, భోజన్న, వీరేశం పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి విదేశీ పర్యటన కారణంగా రాలేదని కొందరు, అనారోగ్యం కారణంగా హాజరుకాలేదని మరికొందరు చెప్పారు.

యెండలకు పరామర్శ: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ సోదరుడు గంగాధర్‌ ఇటీవల మృతిచెందడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం: ఇందూరు సిటీ: ఇస్సాపల్లి దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనిపై ఆర్మూర్‌ ఠాణాలో సుమోటో కేసు నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిలో ఇప్పటికే 15 మందిని ప్రాథమికంగా గుర్తించారు. మరికొందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఆరాతీసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు అత్యంత గోప్యంగా చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

భౌతిక దాడులు మా సిద్ధాంతం కాదు 

ఆర్మూర్‌ పట్టణం: నిజామాబాద్‌ ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకే తెరాస భౌతిక దాడులకు పాల్పడుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం బండి సంజయ్‌ ఆర్మూర్‌ పర్యటనలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. ‘భౌతిక దాడులు మా సిద్ధాంతం కాదు.. అలాంటి ఘటనలను ప్రేరేపించం’ అని పేర్కొన్నారు. కూతుర్ని ఎలా ఓడగొట్టామో, ముఖ్యమంత్రిని వచ్చే ఎన్నికల్లో ఓడించే సత్తా భాజపాకు ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఉండాలని హితవు పలికారు. ఇస్సాపల్లిలో ఎంపీ అర్వింద్‌పై జరిగిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇస్సాపల్లి ఘటనకు సంబంధించిన దృశ్యాలను సెల్‌ఫోన్లో బండి సంజయ్‌కు చూపిస్తున్న పార్టీ కార్యకర్త నరేందర్‌


దమ్ముంటే రా.. నువ్వా, నేనా చూసుకుందాం

‘దమ్ముంటే నందిపేట్‌కు రా.. నువ్వా, నేనా తేల్చుకుందాం’ అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. కార్యకర్తల మధ్య దాడులొద్దు అని అన్నారు. గురువారం నందిపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. తన కాన్వాయ్‌పై దాడి ఘటనతో సీపీకి సంబంధం ఉందని పునరుద్ఘాటించారు. ఘటనపై సుమోటో కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏంటని? ఎంపీగా తాను ఫిర్యాదు చేశానని, దీని ఆధారంగా 307 కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గూండాలను రప్పించారని, తనకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని, ఈ విషయంలో కలెక్టర్‌ స్పందించాలని కోరారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘటనపై ఆరా తీశారని వివరించారు. తనపై దాడి వెనుక హత్యాయత్నం కుట్ర జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీపీ పాత్ర ఉందని నడ్డాతో చెప్పినట్లు పేర్కొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని